చంద్రబాబు, విరాట్ కోహ్లీ: ఒక్క రోజులో సీన్ రివర్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయాల్లో అదృష్టం తిరగబడింది. ఇరువురి విషయాల్లోనూ ఒక్క రోజులో సీన్ రివర్స్ అయింది. శ్రీలంకపై తొలి టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని సునాయసంగా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్సులో బ్యాట్స్‌మన్ చేతులెత్తేయడంతో భారత్ మట్టి కరిచింది.
అదే రీతిలో చంద్రబాబు నాయుడి విషయంలో కూడా పరిస్థితి తిరగబడింది. ప్రత్యేక హోదా, ప్యాకేజీ, హామీలు, రాష్ట్ర విభజన వంటి విషయాలపై ఇటీవల సుదీర్ఘంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడి ప్రతిపక్షాల నోరు మూయించారని అనుకున్నారు. ప్రతిపక్షాలపై ఆయన తిరుగులేని విధంగా పైచేయి సాధించినట్లు కనిపించారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి తారుమారైంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో చంద్రబాబుకు మళ్లీ చిక్కులు తప్పేట్లు లేవు. చంద్రబాబు పరిస్తితిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తారుమారు చేశారు. జగన్ రాసిన లేఖకు కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఆ సమాధానం వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

జగన్ లేఖకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ జవాబిస్తూ - ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్షాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఆందోళనలకు పదును పెట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 29వ తేదీన రాష్ట్ర బంద్‌ను తలపెట్టింది. దానికితోడు, చంద్రబాబుకు మిథున్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ చంద్రబాబు సిద్ధమేనా అని ఆయన అడిగారు. దీంతో చంద్రబాబు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
శ్రీలంకపై తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్లు ఆధిపత్యం సాధించడంతో శ్రీలంక 183 పరుగులకే ఆలవుట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 375 పరుగులు సాధించింది. దీంతో విరాట్ కోహ్లీని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మారడోనాతో పోల్చారు. మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీని ప్రశంసించారు.
అయితే, రెండో ఇన్నింగ్సులో శ్రీలంక కాస్తా తేరుకుని 367 పరుగులు చేసింది. అయినా, భారత్‌కు విజయం ఖాయమైనట్లు అనిపించింది. అయితే, అనూహ్యంగా శ్రీలంక బౌలర్ విరాట్ కోహ్లీ జాతకాన్ని తిరగరాశాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి భారత నడ్డి విరిచాడు. దీంతో భారత్ 63 పరుగుల తేడాతో చిత్తయింది.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని రకాల సాయం సాధిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ తనతో మాట్లాడారని, సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సుదీర్ఘంగా ఆయన మాట్లాడి ప్రతిపక్షాలపై ఆధిపత్యం సాధించినట్లు కనిపించారు. దాంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతిపక్షాలు నోరు మెదపడం మానేశాయి. అయితే, జగన్ ఒక్కసారిగా తనకు కేంద్రం నుంచి వచ్చిన జవాబును బయటపెట్టి సీన్‌ను రివర్స్ చేశారు.












Click it and Unblock the Notifications