విశాఖ-విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపట్నుంచి 3 రోజులు ..!
ఏపీలో రెండు ప్రధాన నగరాలు విశాఖపట్నం- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే వారికి దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం నెలకున్న పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు (Visakhapatnam-Vijayawada Special Trains) నడపాలని నిర్ణయించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు సంబంధించిన సమయాలు, హాల్ట్ లు, ఇతర వివరాలను అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
రాఖీ పండుగతో పాటు ఇతరత్రా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. వీటిలో విశాఖపట్నం-విజయవాడ ప్రత్యేక రైలు నంబర్ 07215 ను ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకూ ప్రతీ రోజూ నడపనున్నారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నంబర్ 07216ను కూడా ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకూ ప్రతీ రోజూ ఈ రెండు నగరాల మధ్య నడుపుతారు. ఈ లెక్కన ఈ రెండు రైళ్లూ కలిపి మొత్తం ఆరు ట్రిప్పులు వేస్తాయి.

ఈ మూడు రోజుల పాటు ప్రతీ రోజూ ఉదయం 8.30కి విశాఖపట్నం నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, నర్సీపట్నం రోడ్డు, తుని, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు మీదుగా విజయవాడకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అలాగే విజయవాడ నుంచి ప్రత్యేక రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరి ఇవే స్టేషన్ల మీదుగా విశాఖపట్నానికి అర్ధరాత్రి 12.45కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ 10 జనరల్ సెకండ్ క్లాస్, 2 లగేజీ కమ్ బ్యారక్ కోచ్ లు మొత్తం కలిపి 12 కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications