బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించింది: న్యాయం కోరితే లక్ష ఇస్తామన్న సర్పంచ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ప్రేమ పేరుతో ఓ యువతిని లోబర్చుకుని, గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడు. ఆ తర్వాత ఆమెను కాదని ఆగస్టు 21న మరో యువతి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పెద్దలను ఆశ్రయిస్తే, రూ. లక్ష తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయాన్నారు.

చేసేదేమి లేక బాధిత యువతి సోమవారం గాజువాక పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే... విశాఖలోని గాజువాక డ్రైవర్స్‌ కాలనీకి చెందిన ఓ మహిళ పాచిపనులు చేసుకుంటూ తన కూతురిని (21) డిగ్రీ వరకూ చదివించింది. సమీప బంధువైన శ్రీకాకుళం జిల్లా చిల్లపేట గ్రామానికి చెందిన చిల్ల దుర్గారెడ్డి (27)తో యువతి ప్రేమలో పడింది.

దుర్గారెడ్డి నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో యువతికి శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఏడో నెల రావడంతో పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో అతడు యువతి చేత బలం మాత్రల పేరుతో రెండు వారాల క్రితం అబార్షన్ మాత్రలు మింగించాడు.

Visakhapatnam woman gives birth in bathroom, flees

దీంతో ఆమెకు జులై 28 నుంచి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో జులై 29 (శుక్రవారం) తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌లో ప్రసవం అయింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పకుండా బిడ్డను అక్కడే వదిలి కడుపునొప్పిగా ఉందంటూ తల్లి, తమ్ముడిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది.

ఇంతలో ఇంటికొచ్చిన యువతి సోదరుడు బాత్‌రూమ్‌లో ఆడశిశువును చూసి స్థానికుల సాయంతో నగరంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం శిశువు కన్నుమూసింది. దీంతో అసలు విషయం బయటపడటంతో తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన దుర్గారెడ్డి ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

ఆ మరుసటి రోజే విశాఖపట్నం నుంచి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా చిల్లపేటకు వెళ్లి కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో యువతి బంధువులు ఆమెకు న్యాయం చేయాలంటూ ఆదివారం చిల్లపేట వెళ్లగా దుర్గారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది.

చేసేదేమిలేక రాత్రి వరకు బాధితురాలి బంధువులు మృత శిశువుతో అక్కడ నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆ ఊరివారిని అడగ్గా ఆ ఊరి సర్పంచ్ కలగజేసుకుని రూ.లక్ష ఇస్తామని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు సోమవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నిందితుడిపై రేప్‌, చీటింగ్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Visakhapatnam woman gives birth in bathroom.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి