సీఎం జగన్ చేసిన ధైర్యం చంద్రబాబు చేయలేరా..!!
టీడీపీని దెబ్బ తీయటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు. చంద్రబాబు దగ్గర అటువంటి వ్యూహాలు లేవా. సమయం కలిసి రావట్లేదా. జగన్ చేసిన ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేరు. ఏం జరుగుతోంది.
ఏపీలో అప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది. అధికార టీడీపీ- ప్రతిపక్ష వైపీపీతో పాటుగా జనసేన ఎన్నికల వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమం - అభివృద్ధి తో పాటుగా మూడు రాజధానుల అంశం కీలకం కానుంది. సుప్రీంలో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఎన్నికల నాటికి తీర్పు రాకపోతే..వైసీపీ ఎన్నికల అస్త్రాల్లో అది బ్రహ్మాస్త్రంగా మారనుంది.

ఉత్తరాంధ్రలో దూకుడు పెంచిన వైసీపీ
ఇప్పటికే సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ మూడు రాజధానులకు జై కొట్టింది. అదే వ్యూహంతో ఉత్తరాంధ్రలో ఆపరేషన్ మొదలు పెట్టింది. వైసీపీ నేతలు విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా డిమాండ్ చేస్తూ రాజీనామాలకు సిద్దమని ప్రకటిస్తున్నారు. ఇది పక్కాగా టీడీపీని ట్రాప్ చేసే వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు విశాఖలో రాజధానికి నో చెప్పలేరు.
అదే సమయంలో వైసీపీతో కలిసి జై విశాఖ అనలేరు. దీని ద్వారా టీడీపీ ఉత్తరాంధ్ర - సీమ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహాన్ని సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే అమరావతికి కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించింది. ఆ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లే అవకాశం లేదు. వైసీపీ మొదలు పెట్టిన పొలిటికల్ గేమ్ లో ప్రస్తుతం ప్రేక్షక పాత్రకే టీడీపీ పరిమితం అయింది.

అమరావతి పైనే చంద్రబాబు ఆశలు
జగన్ రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర - రాయలసీమలో పట్టు పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అమరావతి లో టీడీపీ పట్టు బిగించినా..అక్కడ సోషల్ ఇంజనీరింగ్ పైన జగన్ నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగా.. కొన్ని నియోజవకర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రెండు ప్రాంతాల్లో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టటం ద్వారా అమరావతిలో టీడీపీ పట్టు సడులుతుందని..ఎన్నికల నాటికి చంద్రబాబు ఆ రెండు ప్రాంతాల్లో బలహీన పడితే రాజీకయంగా నష్టపోవటం ఖాయమనే అంచనాతో ఉన్నారు.
కానీ, దీనికి టీడీపీ ఎలా కౌంటర్ చేస్తుందనేది పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లోనూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అమరావతిలో మద్దతు దొరికే అవకాశం కనిపించటం లేదనే వాదన ఉంది. కానీ, చంద్రబాబు బలహీనతే జగన్ కు బలంగా మారనుంది. జగన్ తరహాలో ఓపెన్ గా చంద్రబాబు అమరావతికి మద్దతుగా తన పార్టీ నేతలతో రాజీనామా ప్రకటనలు - వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహాలు అమలు చేయటం లేదు.

జగన్ వ్యూహంలో చిక్కుకున్నారా
అలా చేస్తే మిగిలిన రెండు ప్రాంతాల్లో జగన్ కోరుకున్న విధంగా బలం పెంచుకుంటారని, అది టీడీపీకి నష్టం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేన- బీజేపీ వంటి పార్టీలతో పొత్తుల దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. వారంతా అమరావతికి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అమరావతి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా..వారిని ఇబ్బంది పెట్టని తరహాలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర లో వైసీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో..ఆ ప్రాంత టీడీపీ నేతలు మౌనంగానే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అమరావతిలో టీడీపీ ఛాంపియన్ గా నిలవాలనే లక్ష్యం ఇప్పుడు సందేహంగా మారుతోంది.

ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్
ఒక ప్రాంతంలో బలం పెంచుకోవాలని చూస్తే..మరో రెండు ప్రాంతాల్లో భవిష్యత్ ఏంటనేది చర్చకు కారణమవుతోంది. ఒక విధంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు సెంటిమెంట్ క్రమేణా పెరుగుతోంది. అది రాజకీయంగా టీడీపీకి నష్టం చేసేలా వైసీపీ ముందుకు తీసుకెళ్తోంది. మరి...చంద్రబాబు ఏం చేస్తారు. రాజకీయంగా వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న వేళ..వైసీపీ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications