వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డు- ప్రైవేటీకరణకు సవాల్ విసురుతూ..!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఓవైపు ఈ చారిత్రక ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఆ అవసరం లేదని గుర్తుచేస్తూ తమ సామర్ధ్యాన్ని చాటిచెప్పింది. స్టీల్ ప్లాంట్ స్థాపన నుంచి ఇప్పటివరకూ ఉక్కు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. తాజాగా కేంద్రమంత్రి కుమారస్వామి సందర్శన తర్వాత ఈ రికార్డు నమోదు కావడం విశేషం.
1990లో పూర్తిస్దాయిలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రైవేటీకరణ జాబితాలో చేరిన ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్లాంట్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. కేంద్రం ఇప్పటికే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్న నేపథ్యంలో 100 మిలియన్ టన్నుల రికార్డుతో ఆలోచనలో పడాల్సిన పరిస్ధితి.

తాజాగా స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి ప్రధాని మోడీ ఈ ప్లాంట్ కు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్ పెట్టారని తెలిపారు. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల టార్గెట్ తో పనిచేస్తున్న ఈ ప్లాంట్ లో రెండు ఫర్నేస్ లు మాత్రమే పనిచేస్తున్నాయి. ముడిచమురు కొరతతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్లాంట్ 100 మిలియన్ టన్నుల రికార్డుతో తమ సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించినట్లయింది. కేంద్రం సహకారం అందిస్తే తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు దీంతో నిరూపణ అయింది.












Click it and Unblock the Notifications