విశాఖలో ఉక్కు బాంబు: చంద్రబాబు అనూహ్య స్కెచ్ -ఒకే దెబ్బకు వైసీపీ-బీజేపీ దిమ్మతిరిగేలా..
సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి.. దాదాపు రెండేళ్లుగా అధికార వైసీపీ చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటూ.. పంచాయితీ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదనే అంచనాల నడుమ.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి 'విశాఖ ఉక్కు' రూపంలో గట్టి ఆయుధం దొరికిందా? విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటచేస్తానని సీఎం జగన్ భీష్మించుకున్న వేళ.. ఆ నగరానికి మణిహారమైన స్టీల్ ప్లాంటును.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రైవేటుపరం చేస్తుండటంపై టీడీపీ దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమైందా? ప్రజలకు మళ్లీ దగ్గరయ్యేందుకు చంద్రబాబు దీన్నొక అవకాశంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన కొద్ది గంటలుగా టీడీపీ ఉత్తరాంధ్ర నేతల ప్రకటనలు ఇందుకు మరింత బలం చేకూర్చాయి..
అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ

ఆంధ్రుల హక్కు.. ఇక ప్రైవేటుకు
వాజపేయి హయాం నుంచి బీజేపీ గట్టిగా అనుసరిస్తోన్న ‘ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ' విధానాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ పీయూసీలను ఒక్కొక్కటిగా తెగనమ్ముతుండటం తెలిసిందే. ఆ క్రమంలోనే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటునూ ప్రైవేటుపరం చేయనున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో, పదుల మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంటులో ప్రస్తుతం 100 శాతం వాటా కేంద్రానికే ఉండగా, దాన్ని పూర్తిగా వదులుకునే నిర్ణయానికి మోదీ కేబినెట్ గత వారం ఆమోదముద్ర వేసింది. విశాఖపట్నం స్టీలు ప్లాంటును 100% ప్రైవేటీకరిస్తున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఆ నిర్ణయం వెలువడటంతోనే విశాఖపట్నంలో అలజడి మొదలైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు దశలో నిలిచాయి. ఈ సందర్భంలో..
ఏపీ సీఎం జగన్‌కు ఆర్మీ ఆహ్వానం -తిరుపతిలో బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు -కీలక హామీలు

జగన్ భుజాలపై తుపాకి..
వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కు ప్రధానంగా ఐరన్ ఓర్ లభ్యత, గనుల లేమిని కేంద్రం కారణంగా చూపుతోన్న దరిమిలా.. ఏపీ సర్కారు ద్వారా జారీ అవుతోన్న ఐరన్ ఓర్ గనుల అనుమతులను ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. జగన్ ఉద్దేశపూర్వకంగానే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించని కారణంగా, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, బీజేపీలను సమానంగా తప్పుపడతామంటోన్న టీడీపీ నేతలు.. జగన్ భుజంపై నుంచే తుపాకి పేల్చే తరహాలో.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో సీఎం ముందుంటే తామంతా ఆయన నాయకత్వంలో పోరాడేందుకు సిద్ధమని టీడీపీ సినియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం సంచలన సవాలు చేశారు. అంతేకాదు..

మూకుమ్మడి రాజీనామాల అస్త్రం..
ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినప్పటికీ, గడిచిన రెండేళ్ల పాలనలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందంటోన్న టీడీపీ నేతలు.. పలు సందర్భాల్లో రెఫరెండం సవాలుగా రాజీనామాలకు డిమాండ్లు చేయడం తెలిసిందే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ అంశంలోనూ ఆ పార్టీ మరోసారి రాజీనామాల డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు ఏపీలో పార్టీలకు అతీతంగా అందరు ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏపీలో ఉన్న ఐరన్‌వోరు గనులను అనేక ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కూడా గనుల కేటాయింపులు జరపాలని, దీనిపై సీఎం జగన్ కేంద్రాన్ని కలవాలని గంటా డిమాండ్ చేశారు. ఇక..

కొత్త రాజధానికి బ్యాడ్ టైమ్..
ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంలో అతి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రులు అధికారికంగా ప్రకటనలు చేస్తోన్న వేళ.. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ అంశం రాజధాని తరలింపు నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేయబోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం భూములు కొల్లగొట్టేందుకే వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని, 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొట్టేయటానికి జగన్, సాయిరెడ్డిలు స్కెచ్ వేశారని, అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి, వైజాగ్ స్టీలు ప్లాంటు ప్రైవేటుకు కారకులయ్యారని, ప్రైవేటైజేషన్ ప్రక్రియలో భాగంగా తమ బినామీ కంపెనీ చేత స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారని జగన్, సాయిరెడ్డిలను ఉద్దేశించి అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే వైజాగ్ స్టీల్ ప్లాంటుపై టీడీపీ నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..

చదరంగంలో చంద్రబాబు పావు?
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు అనూహ్య ఎత్తుగడలతో ఇటు వైసీపీ, అటు బీజేపీలను ఇరుకున పెట్టెలా ఉద్యమానికి శ్రీకారం చుడతారనే వాదన ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో దీన్ని (ప్రైవేటైజేషన్) వైసీపీ-బీజేపీలు కలిసి వేసిన ఎత్తుగానూ అనుమానించేవారు లేకపోలేరు. ఏదో ఒక నెరేషన్ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుస్థితికి చంద్రబాబును కారకుండిగా, దాన్ని ఆదుకునే ధీరులుగా వైసీపీ, బీజేపీ నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడే మొదలైన వైజాగ్ ఉక్కు 2.0 పోరులో ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. అయితే, ప్రభుత్వ సంస్థల ప్రైవేటైజేషన్ అంశంలో బీజేపీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది కాబట్టి వైజాగ్ భవిష్యత్తు మారడం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు.