ఆధ్యాత్మిక, వెల్‌నెస్ హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమనం చెందుతుంది. అటువంటి ఏపీని ఆధ్యాత్మిక గమ్యస్థానంగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఆధ్యాత్మికత ద్వారా మానవులకు శాంతి, సంతోషం, ఆరోగ్యం
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీతో కలిసి 15 నిమిషాల పాటు ధ్యానం చేసిన చంద్రబాబు, ఆధ్యాత్మికత ద్వారా మానవులు శాంతి, సంతోషం, ఆరోగ్యం సాధించవచ్చని వివరించారు. తిరుమల, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం మతపరమైన కేంద్రంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత, సుస్థిర ఆరోగ్యం, జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చాలని సీఎం ఆకాంక్షించారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సత్సంగ్ లో పాల్గొన్న చంద్రబాబు
ఈ దిశగా రవిశంకర్ గురూజీ మార్గదర్శకత్వం అవసరమని సీఎం పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సత్సంగ్‌లో పాల్గొన్నందుకు సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
దేశం సవాళ్లను అధిగమించి బలంగా ఎదుగుతుందని చంద్రబాబు ధీమా
అనంతరం మాట్లాడిన చంద్రబాబు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయపరిణామాలు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఈ సవాళ్లను అధిగమించి మరింత బలంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 'నా దేశం - నా బాధ్యత' అనే భావనతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు: రవి శంకర్ గురూజీ
శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ చంద్రబాబును భారత ఐటీ రంగానికి సూత్రధారి అని కొనియాడారు. అమెరికాలో ఐటీ రంగంలో ఎక్కువ శాతం తెలుగు వారే ఉన్నారని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు. యువతను సరైన దిశలో నడిపించడంలో చంద్రబాబు చేసిన కృషి అసాధారణమని గుర్తు చేశారు.
రవిశంకర్ గురూజీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సందర్శన
ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక పర్యాటకం, యోగ, ధ్యానం, సుస్థిర ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి దోహదపడుతుందని ఆయన చంద్రబాబుకు సూచించారు . సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రవిశంకర్ గురూజీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిణామం రాష్ట్రంలో ఆధ్యాత్మికతను ప్రోత్సహించడంతో పాటు, యువతలో మానసిక ఆరోగ్యం, సానుకూల ఆలోచనలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications