నేడు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీ బందోబస్తు..
నేడు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా చేపట్టారు. ఇక, నేడు హుక్కుం పేటలో సిరిమానుకు భక్తులు పసుపు కుంకాలు సమర్పించుకోనున్నారు.
విజయనగరం పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. ఇందులో భాగంగానే అమ్మవారికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవానికి ఊర్లకు ఊర్లే కదిలి రానున్నాయి. పైడి తల్లి అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారమై, కోరిన కోర్కెలెల్లా నెరవేర్చుతారని ఇక్కడివారి ప్రగాఢ విశ్వాసం. ఈ సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరపాలిక పరిధిలో 120 వరకు బయో మరుగుదొడ్లను కూడా సిద్ధం చేసింది. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద కూడా భక్తులకు మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు.

భారీ ఏర్పాట్లు..
జిల్లాల్లో జరిగే అమ్మ వారి సిరిమానోత్సవానికి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు బందోబస్తులో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను కూడా ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఉండేలా చూసుకునేందుకు ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 61 మంది సీఐలు, ఆస్ఐలు, 147 మంది ఎస్సైలు, ఆర్ఎస్ఐలు.. 17 మంది మహిళా ఎస్సైలు, 425 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 136 మంది మహిళా కానిస్టేబుళ్లు, 369 మంది హోంగార్డులు, 200 మంది ఏఆర్ సిబ్బందిని అధికారులు నియమించారు.
విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి కూడా పోలీసులను రప్పించారు. పైడితల్లి జాతర క్రమంలో నేడు నగరంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications