వోల్వోలో మంటలు: అర్ధరాత్రి కాలిబూడిదైన బస్సు, తప్పిన పెను ప్రమాదం
అనంతపురం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కాలికట్ వెళ్తున్న వోల్వో బస్సు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామం వద్ద జాతీయ రహదారి పైన శనివారం అర్ధరాత్రి తర్వాత దగ్ధమైంది.
ఇది కేరళలోని కల్లాడ ట్రావెల్స్‌కు చెందిన బస్సు. ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సు ఆపాడు. ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయిన విషయాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే అతను ప్రయాణీకులను అప్రమత్తం చేశాడు.
ఓ ప్రయాణీకుడు లేవడం, డ్రైవర్ అప్రమత్తం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సుకు మంటలు అంటుకోగానే ప్రయాణీకులు అందరూ దిగారు. ఆ బస్సు మొత్తం కాలి బూడిద అయిపోయింది.

ప్రయాణికులు అందరూ దిగడంతో ఎవరూ గాయపడలేదని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో జాతీయ రహదారి పైన అరగంటపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. కళ్ల ముందే బస్సు దగ్ధం కావడంతో ప్రయాణీకులు భయానికి గురయ్యారు. పెనుప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. మూత్ర విసర్జన కోసం ప్రయాణికుడు బస్సును ఆపినప్పుడు.. డ్రైవర్ కిందకు దిగి టైర్లలో గాలిని పరిశీలించాడు.
ఈ సమయంలో బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్న పాటి అగ్ని కీలలు డ్రైవర్‌కు కనిపించాయి. ప్రయాణికులు బస్సు దిగిన కొద్దిక్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. బస్సు ప్రమాదం విషయం తెలియగానే మంత్రి పరిటాల సునీత అక్కడ సందర్శించారు.












Click it and Unblock the Notifications