ఓటర్ల అంతిమతీర్పు, రాజకీయ నాయకుల తలరాతలు తారుమారు, పక్క రాష్ట్రాల పోలీసులు !
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓటింగ్ పండగ జోరుగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తల రాతలు మార్చడానికి ఓటర్లు అంతిమ తీర్పు ఇస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు ఇచ్చే అంతిమతీర్పుతో నాయకుల తలరాతలు తారుమారు అవుతున్నాయి, నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి జోరుగా ఓటింగ్ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని కొన్ని నియోజక వర్గాల్లో హింస చోటు చేసుకున్నా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమతో పాటు పలు జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో జరగుతున్న ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగడంతో సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. పలు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్ల అంతిమతీర్పు నాయకుల తలరాతలు మార్చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడిన మహిళలు ఓటు వేశారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఉత్సాహంగా వెళ్లి వాళ్లకు నచ్చిన నాయకులకు ఓటు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు సమీపంలోనే తమ పార్టీకి ఓటు వెయ్యాలని ఓటర్లను ప్రలోభపెడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది ప్రతిపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు.
సాయంత్రం 6 గంటల వరకు ఓటు వెయ్యడానికి అవకాశం ఉండటంతో మద్యాహ్నం ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతండటంతో ప్రజలు ఓటు వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళ్లి ఊపిరిపీల్చుకుంటున్నారు. కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.












Click it and Unblock the Notifications