గెలుపు దక్కాలంటే - రెండు పార్టీలకు అక్కడే కీలకం..!!
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతీ సీటు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోరు నెలకొంది. బాపట్ల ఎంపీ స్థానంలో ఈ సారి పోటీ ఆసక్తి రంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అయితే, తాజాగా మారుతున్న సమీకరణాలు ఇక్కడ గెలుపు ఓటమలను డిసైడ్ చేయనున్నాయి.
మారుతున్న లెక్కలు
బాపట్ల పార్లమెంటు నుంచి వైసిపి తరఫున ప్రస్తుత ఎంపి నందిగం సురేష్ మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. టిడిపి నుంచి మాజీ ఐపిఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడి శీలం పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి కృష్ణప్రసాద్ పూర్తిగా నియోజకవర్గానికి కొత్త. తెలంగాణలో బిజెపి నేతగా ఉన్న కృష్ణప్రసాద్ బాపట్ల నుంచి టిడిపి తరఫున ఎంపిగా పోటీలో ఉన్నారు. నందిగం సురేష్ కూడా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గం గురించి పట్టించుకున్న దాఖలాలు లేదనే అభిప్రాయం బలంగా ఉంది. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. చీరాల అసెంబ్లీ నుంచి మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది.

గెలుపు పై ధీమా
గతంలో చీరాల అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున మద్దులూరి మాలకొండయ్య పోటీలో ఉన్నారు. వేమూరు నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు టిడిపి నుంచి పోటీ చేస్తుండగా, వైసిపి నుంచి వరికూటి అశోక్‌బాబు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచి మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జునను సర్వేల ఆధారంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడుకు మార్చారు. ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న అశోక్‌బాబును వేమూరు నుంచి పోటీలో నిలిపారు. ఇక్కడ టిడిపి, వైసిపి అభ్యర్థుల మధ్య గట్టిపోటీ ఉంది.

విజయం దక్కేదెవరికి
బాపట్ల నుంచి శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి వేగేశన నరేంద్రవర్మ మొదటిసారి పోటీ చేస్తున్నారు. జిల్లా లోని పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు అసెంబ్లీల నుంచి మొన్నటి వరకు వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న వారిని తప్పించి కొత్త వారిని ఎన్నికల బరిలో నిలిపారు. ఇలా ఇన్‌ఛార్జులను మార్చడంతో వైసిపి ఎన్నికల వ్యూహం బెడిసికొట్టింది. పర్చూరు, అద్దంకి, రేపల్లె నుంచి టిడిపి ఎమ్మెల్యేలుగా ఉన్న ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. బాపట్ల పార్లమెంటు అభ్యర్థి గెలుపును ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు శాసించనున్నాయి.












Click it and Unblock the Notifications