సాయిబాబాపై సత్య ప్రమాణానికి సవాల్.. తారాస్థాయికి వెలగపూడి vs విజయసాయి.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ..
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గణపతి ఆలయం వేదికగా వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి,టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య బుధవారం(డిసెంబర్ 23) జరిగిన పొలిటికల్ వార్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు దేవుడిపై సత్య ప్రమాణాల దాకా వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఇదే తరహా సవాల్ చేశారు. తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దేవుడిపై సత్య ప్రమాణానికి సిద్దమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రామకృష్ణ సవాల్‌కు ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.
Recommended Video

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : ఎమ్మెల్యే వెలగపూడి
ఎంపీ విజయసాయి రెడ్డి తనపై భూ ఆక్రమణ ఆరోపణలను నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అన్నారు. ఒకవేళ ఆ ఆరోపణలు నిరూపించలేకపోతే విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. కబ్జాల కోసం వైసీపీ నేతలే ఆక్రమణలు తొలగిస్తున్నారని... వాటిని తన బినామీలుగా చూపిస్తూ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సాయిబాబాపై ప్రమాణానికి సిద్దమా...
రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడమే తప్ప రూపాయి సంపాదించింది లేదని రామకృష్ణబాబు అన్నారు. తాను కబ్జాలకు పాల్పడలేదని విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానన్నారు. తన ఆరోపణలు నిజమేనని విజయసాయి రెడ్డి సాయి బాబాపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డి ఎప్పుడొస్తారో చెప్తే... ఆ సమయానికి తానూ అక్కడికి వస్తానన్నారు. 'నువ్వూ రా... ఇద్దరం సాయి బాబాపై సత్య ప్రమాణాలు చేద్దాం...' అని అన్నారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపిస్తే తన నిజాయితీ నిరూపించుకుంటానని పేర్కొన్నారు.

విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్...
దేవుడిపై నమ్మకం లేనివాడు ఎవరిపై అయినా ప్రమాణం చేయగలడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. వంగవీటి హత్య తర్వాత వెలగపూడి విశాఖకు పారిపోయాడని... అక్కడ భూకబ్జాలు,హత్యలు చేశాడని ఆరోపించారు. వెలగపూడికి బినామీ భూములు లేవని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడిపై ప్రమాణ చేయడమేంటని విమర్శించారు. విశాఖపట్నంలో రామకృష్ణను ఎవరైనా ధర్మాతుడు అనుకుంటున్నారా లేక ఒక గూండాగా,రౌడీగా చూస్తున్నారా అన్నది అందరికీ తెలుసన్నారు. రామకృష్ణకు బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపడుతున్నాడని ప్రశ్నించారు. ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్లు బాధపడుతున్నాడని నిలదీశారు. విశాఖ వచ్చిన వెలగపూడి భూములు మేశాడు,పీకలు కోశాడని ఎంతోమంది చెప్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications