జగన్‌కు షాక్, వైసిపి మొత్తం ఖాళీ: బాబునే కలుస్తా.. జ్యోతుల నెహ్రూ కొత్త ట్విస్ట్
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసిపి ఒక్క సీటు గెల్చుకోలేదు. జ్యోతుల నెహ్రూ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం అయిదు సీట్లు గెలుచుకుంది.
జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల గెలుపొందారు. తాను గెలవడంతో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పుడు నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరేందురు రంగం సిద్ధం చేసుకున్నారు. నెహ్రూతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
పత్తిపాడు నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు... నెహ్రూ తోడల్లుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. నెహ్రూ టిడిపి వైపు మొగ్గడం వల్లే, సుబ్బారావు సైకిల్ ఎక్కుతానని ప్రకటన చేశారని భావించవచ్చు. ఆయన ప్రకటన ద్వారా కూడా నెహ్రూ టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారనుకోవచ్చు.

జ్యోతుల, సుబ్బారావులతో పాటు మరో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తూగో నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో 5గురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో జ్యోతుల, సుబ్బారావు, మరో ఇద్దరు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైసిపికి తూగోలో మిగిలేది ఒక ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే కూడా సైకిల్ ఎక్కే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇటీవల పీఏసీ చైర్మన్ పదవి విషయంలో వైసిపి అధినేత జగన్.. సీనియర్ అయిన నెహ్రూను పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో జిల్లాలో తన సత్తా ఏమిటో జగన్‌కు రుచి చూపించి మరీ.. సైకిల్ ఎక్కాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన చేరిక ఆలస్యం అవుతోందని అంటున్నారు. టిడిపిలో చేరడం ఖాయమని, భారీ స్థాయిలో చేరాలని భావిస్తున్నారని, తద్వారా జగన్‌కు తన సత్తా చూపించాలనుకుంటున్నారని తెలుస్తోంది.
వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులను కూడా చాలామందిని తన వెంట తీసుకు వెళ్లాలని జ్యోతుల నెహ్రూ భావిస్తున్నారని తెలుస్తోంది. జ్యోతుల నెహ్రూ కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కూడా చెప్పుకోవచ్చు.
వ్యక్తిగతంగా చిన్న మచ్చ కూడా లేని జ్యోతుల నెహ్రూ ఏ పార్టీలో ఉన్నాఆ పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం నెహ్రూతో పాటు చాలామంది నేతలను షాక్‌కు గురి చేసిందని, జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
పార్టీ మార్పుపై జ్యోతుల ట్విస్ట్
పార్టీ మారే విషయమై తానింకా ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని జ్యోతుల నెహ్రూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. తాను పార్టీ మారాలనుకుంటే ఎవరితోనూ చర్చించక్కర్లేదని, నేరుగా చంద్రబాబునే కలవగలనన్నారు.












Click it and Unblock the Notifications