పిలిచి తిట్టిస్తున్నారు: బాబుపై తలసాని, లోకేష్ ఎందుకని
హైదరాబాద్: తాము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలు గురువారం ఉదయం చెప్పారు. అదే సమయంలో వారు తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
తాము తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సమావేశాల పేరుతో తమను పిలిచి తెరాస పైన విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు బాబే కారణమన్నారు.

తాము బంగారు తెలంగాణ కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నామని చెప్పారు. తెలంగాణ టీడీపీలో నాయకత్వమే లేదా అని తీగల ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేలు తీగల, తలసాని, ప్రకాశ్ గౌడ్, ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో మంత్రులు హరీష్ రావు, రాజయ్య తదితరులు కూడా హాజరయ్యారు. కాగా, తెరాస ప్రభుత్వాన్ని తిప్పి కొట్టేందుకు రేపటి నుండి టీడీపీ బస్సుయాత్ర చేపట్టనుంది. బస్సుయాత్రకు ముందే టీడీపీ నేతలు షాకివ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications