రెండు రాష్ట్రాలు కలవాలని కోరుకోవడం లేదు: చంద్రబాబు
మహబూబ్‌నగర్: తాము తిరిగి రెండు రాష్ట్రాలు కలవాలని కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ బహిరంగసభలో మాట్లాడారు. తాము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఐక్యంగా సాగితేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా సాగుతాయని చెప్పారు. తనకు రాయలసీమ, తెలంగాణ ఒక్కటేనని అన్నారు. విభజన జరిగింది భౌతికంగా గానీ, మానసికంగా కాదని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలను కలిపి ఉంచే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణను అభివృద్ధి చేసేంది తానేనని ఆయన తెలిపారు.
ఇక్కడ ప్రజల అభీష్టం మేరకు ఎంతో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. అందుకే అమరవీరులకు జోహార్లు అర్పించామని తెలిపారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే తెలుగుదేశం అభిమతమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా, ఏపిలో అధికారంలో, కేంద్రంలో మిత్రపక్షంగా కొనసాగుతోందని చెప్పారు.

తెలంగాణను అభివృద్ధి చేయాలనే కేంద్రాన్ని కోరుతున్నామని చంద్రబాబు చెప్పారు. తనను ఇక్కడి టిడిపి కార్యకర్తలు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. టిడిపికి ఉక్కులాంటి పటిష్టమైన కార్యకర్తల బలముందని చెప్పారు. మంచి వాతావరణంలోనే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి చెప్పామని అన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు.
టిడిపిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండటానికి కారణం హైదరాబాద్ అని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తాను కాదా? అని ప్రశ్నించారు. అందరికి న్యాయం చేయాలన్నది టిడిపి ఉద్దేశమని చెప్పారు. టిడిపి హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణలో విద్యా, వైద్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చింది తమ ప్రభుత్వమేనని అన్నారు.
తమ హయాంలో ఇక్కడ 24గంటలు కరెంటిచ్చామని, ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వం తమను విమర్శిస్తోందని అన్నారు. ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టిడిపి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని, తాను కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా టిడిపి నేతలు తట్టుకుంటున్నారని, తాము మూడోసారి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు కూడా తనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తనపై అభిమానాన్ని చూపిస్తున్నారని అన్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలని, ముందుకు నడిపించాలని నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications