నాడు- నేడు పథకాన్ని ఏం చేయబోతున్నామో వెల్లడించిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి.. నాడు-నేడు. దీనికింద రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దింది. ఇంగ్లీష్‌లో విద్యాబోధనకూ శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నాడు- నేడు పథకంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు సర్కార్ దీన్ని కొనసాగిస్తుందా? లేదా? అనే చర్చ మొదలైంది.

దీనిపై అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. నాడు- నేడు పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. తన సమాధానాన్ని ఆయన చదివి వినిపించారు.
నాడు- నేడు కింద తొలిదశలో 15,713 పాఠశాలలను గత ప్రభుత్వం అభివృద్ధి చేసిందని వివరించారు. రెండో విడత కింద 22,311 పాఠశాలల్లో పనులు చేపట్టిందని అన్నారు. ఇది పూర్తి కావడానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరమౌతాయని నారా లోకేష్ లెక్కగట్టారు.
మూడో విడత కింద 14, 845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదని నారా లోకేష్ చెప్పారు. వీటిని పూర్తి చేయడానికి మరో 3,008 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయల మేర బిల్లులను పెండింగ్‌లో ఉంచిందని నారా లోకేష్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
అయినప్పటికీ- ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు భారీగా పెరిగాయని, 72,192 మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానివేశారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు కోర్టులో పిటీషన్ వేశారని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏడాది లోగా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications