ఫ్రీజోన్, సీరియస్‌గా: బాబుకు టిజి వెంకటేష్ షాక్, రాజధానిలో చేరినవి ఇవే..
కర్నూలు: తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయవద్దని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత టిజి వెంకటేష్ బుధవారం నాడు అన్నారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటిస్తేనే, మిగతా ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయన్నారు. అలా ప్రకటించకుంటే మిగతా ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తాము పోరాడుతామని చెప్పారు.
అలాగే, ఉత్తరాంధ్రకు, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం పైన తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని టిజి వెంకటేష్ చెప్పారు. రాయలసీమకు న్యాయం చేయాలని, అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర ఉద్యమం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాగా, కృష్ణా జిల్లా నుంచి కొత్తగా 123 గ్రామాలు, గుంటూరు జిల్లాలో మరో 30 గ్రామాలలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధి (సిఆర్డీఏ) ప్రాంతం... 7068.20 నుంచి 8352 చదరపు కిలోమీటర్లకు పెరిగిన విషయం తెలిసిందే.
సీఆర్డీఏ పరిధిని విస్తరిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం 7068.20 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్డీఏను మరో 1284.49 చదరపు కి.మీ.కు పెంచినట్లు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల సీఆర్డీఏ పరిధి 8352.69 చదరపు కిలోమీటర్లకు చేరింది.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం సహా మండలంలోని 24 గ్రామాలు, వత్సవాయి లోని 26 గ్రామాలు, పెనుగంచిప్రోలులో 12, మైలవరం లోని 4, నూజివీడు మండలంలో రెండు, బాపులపాడు మండలంలో 3, మువ్వ మండలంలో 7, ఘంటసాల మండలంలో 9, చల్లపల్లిలో 2, మోపిదేవి మండలంలో ఏడు, పామర్రులో 10, నందివాడలో 10, గుడివాడలో ఆరు, నందిగామ మండలంలో ఒక గ్రామాన్ని చేర్చారు. దీంతో కొత్తగా కృష్ణా జిల్లాలో ఒక పట్టణం, 123 గ్రామాలు సీఆర్డీఏ పరిధిలోనికి చేరాయి.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో 6, క్రోసూరులో 5, సత్తెనపల్లిలో 2, ఫిరంగిపురంలో 3, యడ్లపాడులో 2, పత్తిపాడులో ఒకటి, పొన్నూరులో మూడు, భట్టిప్రోలులో 8 గ్రామాల (మొత్తం-30)కు సీఆర్డీఏ పరిధిని విస్తరింపచేశారు.












Click it and Unblock the Notifications