మేం ఏం చేస్తానమనేది సీక్రెట్: విభజనపై ఉండవల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తాము ఏం చేస్తామనేది రహస్యమని కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన ఆదివారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తాను చేసే కార్యక్రమాల్లో కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని దాచేవి ఉంటాయని ఆయన అన్నారు. 2014 ఎన్నికల లోపు విభజన జరగదని తనకు నమ్మకం ఉందని ఆయన చెప్పారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రంలోనే కాంగ్రెసు నాయకత్వం మాటలను ఆ పార్టీ వినడం లేదనే ప్రచారం సాగుతుందని ఆయన అన్నారు. అయితే విభజన ప్రమాదం మాత్రం ఉందని ఆయన చెప్పారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులం 40 మందిమి బుధవారం రాష్ట్రపతిని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని, అయితే అది హేతుబద్దంగా జరగాలని ఆయన అన్నారు. తాము రాజీనామా చేసినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి మెజారిటీ లేదని, ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో వివిధ పార్టీలు వెనక నుంచి పక్క నుంచి మద్దతు తెలుపుతుండడం వల్ల ప్రభుత్వం నిలబడుతోందని ఆయన అన్నారు.

యుపిఎ భాగస్వామ్య పక్షాలు కూడా తగ్గుతున్నాయని ఆయన అన్నారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదని, దానిపై తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తాము చేయాల్సిందంతా చేస్తామని, ఏం చేస్తామనేది చెప్పబోమని ఆన అన్నారు. అసెంబ్లీ తీర్మానం తర్వాతనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన అన్నారు. విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం వల్లనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ఏ రాజకీయ నాయకత్వం లేకుండా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా సుదీర్ఘ కాలం ఉద్యమం సాగిందని ఆయన అన్నారు. అందుకు ఎపి ఎన్జీవోలను అభినందిస్తున్నానని, ఎపి ఎన్జీవోలు సమ్మెను విరమించడం కూడా సరైందేనని, వారి ఉద్యమం విజయం సాధించిందని ఆయన అన్నారు. 12 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం లేదని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్వయంగా చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications