ఎంత పెద్దవారున్నా వదిలేది లేదు: డిజిపి రాముడు, కాపులు తలొంచొద్దు: కన్నా
విజయవాడ: కల్తీ మద్యం సేవించి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ డీజిపి జేవీ రాముడు మంగళవారం నాడు పరామర్శించారు. విజయవాడ కృష్ణలంక స్వర్ణ బార్‌లో సోమవారం కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
డిజిపి... హాస్పిటల్ ఎండీ డాక్టర్ పివి రమణమూర్తితో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్నటి ఘటనపై విచారిస్తున్నామన్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే ఎవరినైనా విడిచిపెట్టేది లేదని చెప్పారు.
డీజీపీ రాముడు.. స్వర్ణ బార్‌లోకి కూడా వెళ్లారు. బార్‌లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి రికార్డులనన్నింటినీ సీజ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. దోషులుగా తేలిన వారిలో ఎంతటి పెద్ద వారున్నా వదిలేది లేదన్నారు.
కల్తీ మద్యం ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినది. బార్ లైసెన్స్ ఆయన పేరిట లేకున్నా, స్వయానా ఆయన తల్లికి యాజమాన్యంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో విష్ణు పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

కాపులు హక్కులు సాధించుకోవచ్చు: కన్నా
ఏపీలో భారీ సంఖ్యలో ఉన్న కాపులు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదని, పోరాటం ద్వారా హక్కులను సాధించుకుందామని బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం పిలుపునిచ్చారు.
జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగే కాపు ఉద్యమ సభకు కాపులంతా హాజరుకావాలన్నారు. ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులంతా ఉద్యమించాలని సూచించారు. ప్రభుత్వ హామీలన్నింటినీ నెరవేర్చుకునే దిశగా ఉద్యమించాలన్నారు.












Click it and Unblock the Notifications