మంత్రులైనా వేటు, జాబితా రెడీ: బొత్స, కిరణ్ పార్టీపై నో
హైదరాబాద్: ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు కాంగ్రెసు పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారి పైన వేటు వేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. మంత్రులు, ఎవరైనా వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి జాబితాను తాము నిన్నటి నుండి తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలలోకి వెళ్ళేందుకు పార్టీ పైన బురద జల్లుతున్న డిసిసి, పిసిసి సభ్యుల పైన వేటు వేస్తామన్నారు. ఇది తన మాట మాత్రమే కాదని అధిష్టానం మాట కూడా అన్నారు.

విభజన బిల్లుపై అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన నాయకులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా మాట్లాడుతారని చెప్పారు. కాగా, పక్క చూపులు చూస్తున్న వాళ్లే విభజన అంశంలో పార్టీని ముద్దాయిని చేస్తున్నారని, వాళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని బొత్స సత్యనారాయణ నిన్ననే చెప్పిన విషయం తెలిసిందే.
కిరణ్ పార్టీపై..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని బొత్స అన్నారు. మరోసారి తనను కొత్త పార్టీ విషయమై అడగవద్దన్నారు.
వేటుపై షరతు!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేస్తామని బొత్స చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ అనధికారిక షరతు ఉందంటున్నారు. కేవలం ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు విమర్శలు చేస్తున్న వారి పైన చర్యలు తీసుకుంటారు. సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలను ఆశించి విమర్శలు చేస్తున్న వారిపై చర్యలుండవని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications