వాయుగుండం ఎఫెక్ట్: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ముందుకొస్తున్న సముద్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి సమీపిస్తున్న వాయుగుండం.. చెన్నైకి 140 కి.మీలు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225 కిలోమీటర్ల దూరంలో
కొనసాగుతోంది.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీ తీరానికి దగ్గరగా వాయుగుండం..
వాయుగుండం రాబోయే 48 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరానికి దగ్గరగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు, వర్షాల కారణంగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. ఇది ఇలావుండగా, తమిళనాడు రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.

ఏపీ తీర ప్రాంతాలకు అలర్ట్.. ముందుకొస్తున్న సముద్రం
వాయుగుండం కారణంగా కోట, వాకాడు మండలాల సమీపంలోని తీరంలో అలల ఉధృతి పెరుగుతోంది. కోట మండలం కొత్తపట్నం, గోవిందపల్లిపాళెం, శ్రీనివాససత్రం, వావిళ్లదొరువు, యమదిన్నెపాళెం సమీపంలో సముద్రం ముందుకు వస్తోంది. వాకాడు మండలం తూపిలిపాళెం, శ్రీనివాసపురం, నవాబుపేట, కొండూరుపాళెం, వైట్‌కుప్పం, ఓడపాళెం సముద్ర తీరప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. తీరం వెంబడి చలిగాలులతో జల్లులు కురుస్తుండటంతో ప్రజలంతా వణికిపోతున్నారు. అధికారులు కూడా ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. వర్షంలో అనవసరంగా బయటికి రాకూడదని, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications