ఎవరో మార్చడం ఎందుకు?: పార్టీ మారిన వారికి పవన్ కళ్యాణ్ 'పంచ్'
హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ఈ పద్ధతిని ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉందని సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు నేనే నాంది పలుకుతా'నని ఆయన అన్నారు.
భావదారిద్ర్యం తనకు నచ్చదని, ఉన్నత ఆశయాలు లేకపోతే అది దౌర్భాగ్యం కిందే లెక్క అని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాముఖ్యతను సంతరించుకున్న 'ఆపరేషన్ ఆకర్ష్' పై ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి బలమైన కారణం ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
అయితే రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. సిద్ధాంతాలు లేని నాయకులుంటే ఇలాగే ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తాను చాలా బాధపడ్డానని కళ్యాణ్ చెప్పారు. అప్పట్లో ప్రజల తరపున మాట్లాడే నాథుడు కనపడలేదని ఆయన తెలిపారు.

రాజకీయ నేతలు, పాలకులు చేసిన తప్పులకు ప్రజలను బాధ్యులను చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటు తనానికి బాధ్యత రాజకీయ నాయకులదైతే దానిని ప్రజలను బాధ్యులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రజల్లో మనిషినేనని, అందుకే బాధపడ్డానని ఆయన చెప్పారు.
ఈ విభజన సందర్భంగా ఏ ఒక్కరూ కూడా ప్రజల పక్షాన నిస్వార్ధంగా మాట్లడలేదని ఆయన అన్నారు. తాను చెప్పిన ఏ మాటా మర్చిపోలేదని ఆయన స్పష్టం చేశారు. గొడవ పెట్టుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయని, వాటిని వెల్లడించే సమయం కోసం చూస్తున్నానని ఆయన చెప్పాడు.












Click it and Unblock the Notifications