సారీ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏమన్నారంటే?
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యతులను ఉపేక్షించేది లేదన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.
అనంతరం బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని అన్నారు.

తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, శనివారం వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు. ఘటనలో తమ తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో అన్నీ అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినవి కాదని తెలిపారు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని, క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలి బీఆర్ నాయుడు కోరారు.
అంతకుముందు బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని.. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారని వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో మాట్లాడారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తప్పిదం జరిగింది.. అది ఎలా జరిగిందనేది విచారణలో తేలుతుందని చెప్పారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications