రైతు సమస్యలు పట్టని వ్యవస్థలు ఉండి ఏం లాభం?రెవెన్యూ శాఖలో మార్పు రావాలన్న పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య ఘటన కలచివేసిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేశారని, వాటిని సరిచేయమని ఆంజనేయులు నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడటం అత్యంత శోచనీయమన్నారు పవన్ కళ్యాణ్.

అన్నదాత కష్టాలకు అంతం లేదా.?వ్యవస్థలు ఉంటే చాలదన్న పవన్ కళ్యాణ్
రైతుల భూముల వివరాలను పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడమే ఒక పొరపాటు అయితే, వాటిని సరి చేయకుండా ఆ రైతులను తమ చుట్టూ తిప్పించుకొంటున్న అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాలన్నారు పవన్. రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు, వాటికి బాధ్యులుగా గ్రూప్ వన్, ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఆంజనేయులు ఈ 7వ తేదీన గుంటూరు కలెక్టర్ దగ్గరకు పురుగుల మందు డబ్బాపట్టుకొని వెళ్ళి మరీ తన గోడు చెప్పుకొన్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.

అదికారుల్లో మార్పు రావాలి.. పోయిన ప్రాణాలను ఎవరు తెస్తారన్న జనసేనాని..
కలెక్టర్ ఈ సమస్యను పరిష్కరించాలని, క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా ఆ అధికారుల నిర్లక్ష్యం విలువ ఒక రైతు ప్రాణమన్నారు జనసేనాని. రైతులకు సంబంధించి అనేక పనులు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయని, ఆ శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు మానసిక క్షోభను కలిగిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు పవన్ కళ్యాణ్.

రెవెన్యూ శాఖలో ప్రక్షాళన అవసరం.. అన్నదాత కష్టాలను చూసి చలించిపోయిన భీమ్లా నాయక్
అయినా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతుల క్షోభను తీర్చడంలో పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టడం లేదని మండిపడ్డారు. పాస్ పుస్తకాల జారీ నుంచి పంట నష్ట పరిహారం వరకూ రైతులకు సంబంధించిన పనులను చేసి పెట్టడంలో రెవెన్యూ సిబ్బంది సమాజానికి ఆహారం అందించే ఒక కష్ట జీవి కోసం బాధ్యత నిర్వర్తిస్తున్నామని భావించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

నిర్లక్ష్యపు అధికారులను శిక్షించాలి.. రైతు ఆత్మహత్యలకు నష్టపరిహారం ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్
ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలని, ఈ రైతును గత నాలుగేళ్ళు తిప్పించుకొని సమస్యను పరిష్కరించని అధికారులను, తాజాగా కలెక్టర్ ఆదేశించినా నిర్లక్ష్యం వహించినవారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications