Vizag Drugs: విశాఖలో 25 వేల కేజీల డ్రగ్స్ అసలు స్టోరీ ఇదే..! ఎందుకు తెప్పించారంటే..
ఈ నెల 16న విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్ షిప్ నుంచి 25 వేల కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ నిన్న చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 50 వేల కోట్లకు పైగా విలువ ఉంటుందని భావిస్తున్న ఈ డ్రగ్స్ ను ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏముందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వివరాలను వీటి కన్ సైనీ సంస్ధ సంధ్యా అక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది.
ఈ డ్రగ్ కంటెయినర్ ను భారత్ కు తెప్పించిన విశాఖ సంస్ధ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈడీ కున్నం హరికృష్ణ దీనిపై స్పందించారు. ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, డైడ్‌ఈస్ట్ దానికి ముడిసరకు అని తెలిపారు. బ్రెజిల్ నుంచి దీన్ని తెప్పించామన్నారు. ఈ నెల 16న సరకు కంటైనర్‌లో విశాఖ వచ్చిందన్నారు. ఈ నెల 19న సీబీఐ బృందం సరకు పరిశీలించిందన్నారు. డ్రగ్స్ ఉన్నాయంటూ సరకును పరీక్ష కోసం సీబీఐ తీసుకెళ్లిందన్నారు. ఇవాళ మరోసారి తనిఖీ చేస్తారని తెలిపారు.

జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి 16న సరకు కంటెయినర్ విశాఖ చేరిందని కున్నం హరికృష్ణ తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలియదన్నారు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమన్నారు. సీబీఐ విచారణకు సహకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. సంస్ధ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. 25 వేల కేజీల డ్రై ఈస్ట్ ను ఆర్డర్ చేసామని ఈ నౌక రావలసిన సమయం కంటే ఆలస్యంగా విశాఖ చేరిందన్నారు.
జనవరి 14న బ్రెజిల్ లో బయలుదేరిందని, మార్చి 16న విశాఖ చేరుకుందన్నారు. మార్చి 16వ తేదీన ఇంటర్ పోల్ కు నౌక సమాచారం వచ్చిందని, మార్చి 19న ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం రెండు రోజులు తనిఖీలు చేసిందన్నారు. రొయ్యల మేత తయారీకి సరుకు ఆర్డర్ చేసినట్టు ఆయన వెల్లడించారు. కానీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని సీబీఐ చెబుతోందని, దీంతో మరో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications