పొగమంచులాగా కప్పేసిన గ్యాస్: ఎటు వెళ్లాలో తెలియని దుస్థితిలో జనం: మూసేయాలంటూ డిమాండ్
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు వెలువడటం పట్ల స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. తెల్లవారు జామున తాము నిద్ర లేవడంతోనే కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలతో.. ఊపిరి అందకుండా ఉక్కిరి బిక్కి అయ్యామంటున్నారు. పొగమంచులాగా గ్యాస్ తమ ప్రాంతాన్ని కప్పేసిందని భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను అక్కడి నుంచి తొలగించాలని లేదా మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో తాము ఉన్నామని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటు వెళ్లినా విషవాయువుల ప్రభావం వెంటాడుతోందని చెబుతున్నారు. గాలి ఆడక ఒళ్లంతా చెమటలు పట్టాయని, ఇంట్లో పిల్లలు, వయోధిక వృద్ధులు కళ్లను తెరవలేక, ఊపిరి పిల్చుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని అంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను జనావాసాల మధ్య నుంచి దూరంగా తరలించాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

అయిదు గ్రామాలపై గ్యాస్ ప్రభావం పడిందని, ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గెదెలు, ఎద్దులు సైతం విష వాయువులను పీల్చి మరణించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించాలని కోరుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నారని అన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల వారి ఒళ్లంతా చెమటతో తడిచిపోతోందని తమ అనుభవాన్ని వివరిస్తున్నారు.