‘చంద్రన్న’ గోధుమ పిండిలో తవుడు..!: ఆగ్రహించిన చంద్రబాబు, విచారణకు ఆదేశం
అమరావతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు ‘చంద్రన్న కానుక'ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసిన సరుకులను కొంత మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది.
ఈ సరుకుల్లోని గోధుమ పిండిలో తవుడు వచ్చిందని విజయనగరం జిల్లాకు చెందిన బాధితులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం విజయవాడ నుంచి ‘జన్మభూమి- మా ఊరు' కార్యక్రమంపై జిల్లా అధికారులతో చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ పిండిలో తవుడు వచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల అమలులో సృజనాత్మకత ఉండాలని బాబు సూచించారు. మూస పద్ధతిలో వెళ్తే సరైన ఫలితాలు రావని, వినూత్న విధానాలు అవలంభించాలని చంద్రబాబు కోరారు.
పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డుల పంపిణీ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయి, రియల్ టైమ్‌లో డేటా అప్‌డేట్ కావాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications