ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..? నెట్టింట వైరల్ అవుతున్న లేఖ..!
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ మాత్రమే ఇప్పటి వరకూ ఈ అంశంపై తీవ్రస్థాయిలో పోరాటం చేయగా ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. నీట్ పరీక్ష లీక్ పై దేశ రాజధాని దిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల ఎంపీలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు సీజేపీ సైతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
జూలై 20న దిల్లీలో జరిగిన ఆందోళనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరింతగా విస్తరించి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే లక్షలాది మంది యువత దిల్లీకి తరలివస్తారని స్పష్టం చేశారు. ఇక ఈ వివాదం వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది ఫేక్ అయినప్పటికీ.. విద్యార్థులు, నెటిజన్లు ఈ రాజీనామా లేఖను తెగ షేర్ చేస్తున్నారు. తద్వారా తమ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వినిపిస్తున్నారు.
రెడ్డిట్ అనే సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. " గౌరవనీయులైన రాష్ట్రపతి గారెకి తెలియజేయునది ఏమనగా.. నేను, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి నా రాజీనామాను సమర్పిస్తున్నాను. తక్షణమే నా రాజీనామా లేఖను ఆమోదించాలని మనవి. ఇప్పటివరకు దేశ ప్రగతికి, దేశంలోని విద్యా రంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా పదవీకాలంలో పలు విధాలుగా సహకరించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అధికారులకు కృతజ్ఞతలు" అని ఓ ఫేక్ లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఈ అంశంపై మాట్లాడుతూ కేంద్రం తమతో చర్చలు జరపాలంటే ఇక్కడకు రావాలని అన్నారు. తాము పెట్టిన నిబంధనలకు లోబడి వ్యవహరించాలని తెలిపారు. తమ డిమాండ్లను ఒప్పుకోవాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications