షర్మిలకు జగన్ షాక్- వైసీపీలో చేరిపోయిన కాంగ్రెస్ నేతలు..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)కు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో వైఎస్సార్సీపీ (YSRCP)లో చేరిపోయారు. దీంతో వారిని జగన్ ఆప్యాయంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. వీరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఉన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొందరు ఇవాళ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకుడు డి.సతీష్‌బాబు తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని వారికి సూచించారు.

అనంతరం వైయస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని వైసీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకులు నాగలక్ష్మి, సతీష్‌బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైయస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని వారు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టి.నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.












Click it and Unblock the Notifications