వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలుసా?
ఏపీ ఎన్నికల ఫలితాల్లో గన్నవరం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన వల్లభనేని వంశీ 37వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. గెలిచిన తర్వాత మంచి దూకుడుమీద ఉన్న టీడీపీ శ్రేణులు శుక్రవారం విజయవాడలోని వంశీ ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారం అందుకున్న వెంటనే ఆందోళనకారులు భారీగా అక్కడికి చేరుకొని సెల్లార్ లో ఉన్న వంశీ వాహనాలన్నింటినీ ధ్వంసం చేశారు.
దమ్ముంటే బయటకు రావాలంటూ సవాల్
దమ్ముంటే వంశీ బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అక్కడినుంచి పంపించేశారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలరోజు సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి వంశీ హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే విజయవాడలోనే ఉన్నారన్న సమాచారం రావడంతో గన్నవరం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా వంశీ ఇంటికి చేరుకున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడంలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ముఖ్యమంత్రిగా శాసనసభలోకి
గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని కూడా వంశీ ఖాళీ చేశాడు. తీసుకున్న లీజు ముగియడంతో కార్యాలయాన్ని ఖాళీచేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఇటువంటి ఉద్రిక్తతల మధ్య రక్షణ కల్పించలేమని వంశీకి స్పష్టం చేసినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వంశీ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. దగ్గరైన తర్వాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై, కొడుకు నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు భావోద్వేగానికి గురై తిరిగి ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications