ఎమ్మెల్యే పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చింది ఎవరు?
మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో పిన్నెల్లి మీద 10 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నియోజకవర్గం నుంచి హైదరాబాద్ చేరుకున్న పిన్నెల్లి సోదరులు తర్వాత మహబూబ్ నగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
పత్తి వ్యాపారుల షెల్టర్?
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కొందరు షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. షెల్టరు ఇచ్చినవారు ఏపీకి చెందిన కొందరు పత్తి వ్యాపారులేనని తెలుస్తోంది. ఒంగోలు జిల్లా పర్చూరుకు చెందిన రామనాథం బాబు అనే పత్తి వ్యాపారి ప్రధానం అని తెలుస్తోంది. సాయికృష్ణ సీడ్స్ పేరుతో గతేడాది వరకు ఓ కంపెనీని ఆయన నడిపారు. ఒంగోలులో వైసీపీ నాయకుడిగా ఉన్నారు.

లుక్ ఔట్ జారీచేసిన పోలీసులు
ప్రస్తుతం పిన్నెల్లిపై లుక్ ఔట్ నోటీసును పోలీసులు జారీచేశారు. విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉండటంతో ముందస్తుగా దీన్ని జారీచేశారు. వాస్తవానికి ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అడుగు ముందుకు వేయక తప్పలేవు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గం నుంచి బయటపడటానికి కూడా పోలీసులే కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అటువంటివారు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయరని, ఏం జరుగుతోందనే సమాచారాన్ని కూడా అందజేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications