వివేకా హత్య కేసుపై రఘురామ కొత్త డౌట్స్-శివగామి ఎవరని ప్రశ్న-సీబీఐ అనుమానాలతో
కడప జిల్లా పులివెందులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి వాంగ్మూలాన్ని రెండుసార్లు రికార్డు చేయడమే కాకుండా అసలు నిందితుల్ని పట్టుకునేందుకు సీబీఐ వేగంగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ కేసుపై పలు ప్రశ్నలు సంధించారు.
ఇందులో ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివగామి ఎవరంటూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. బాహుబలిలో శివగామి పాత్ర ఆదేశాల మేరకు బాహుబలిని కట్టప్ప చంపుతాడు. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ వివేకా హత్య కేసులో శివగామి ఎవరంటూ రఘురామ వేసిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు వివేకా హత్య జరిగి ఉంటుందంటూ సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నతరుణంలో రఘురామ వేసిన ప్రశ్న ఆయన్ను టార్గెట్ చేసే అయి ఉంటుందని భావిస్తున్నారు.

Recommended Video
వివేకా మాజీ డ్రైవర్, ఆయన హత్య కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చి న వాంగ్మూలంలో మరిన్ని కొత్త పేర్లు వెలుగుచూసే అవకాశం ఉందని రఘురామరాజు జోస్యం చెప్పారు. అలాగే సీబీఐ వీరిని వారం రోజుల్లో విచారణకు పిలుస్తుందని కూడా తెలిపారు. ఫైనల్ గా వివేకా హత్య కేసులో దోషులెవరో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘురామ పేర్కొన్నారు. సీబీఐ దూకుడు, దస్తగిరి వాంగ్మూలం, కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై అనుమానాల నేపథ్యంలో రఘురామ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో దస్తగిరి రెండో వాంగ్మూలం తర్వాత మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే అవకాశముందని భావిస్తున్న తరుణంలో రఘురామ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.












Click it and Unblock the Notifications