భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి నిజమైన వారసులెవరు??
ఏపీ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులు చెరగని ముద్ర వేశారు. ఆళ్లగడ్డ, నంద్యాలలో ప్రజాప్రతినిధులుగా ఎవరూ తెచ్చుకోని పేరును తెచ్చుకొని ప్రజల గుండెల్లో నిలిచారు. వీరి వారసులుగా భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందుగా విజయం సాధించినప్పటికీ 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఓటమిపాలయ్యారు.

వివాదాల్లో చిక్కుకున్న అఖిలప్రియ?
భూమా అఖిల ప్రియ వివాహం చేసుకున్న తర్వాత ఆమె భర్త భార్గవ్ తో కలిసి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. జరుగుతున్న వివాదాలన్నీ ఆమెకు తెలిసి జరుగుతున్నా, తెలియక జరుగుతున్నా నష్టం మాత్రం ఆమెకే జరుగుతోంది. దీంతో ఆమె ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టిసారించకపోవడంతో పార్టీ బలాన్ని పెంచడంలో తొట్రుపాటుకు గురవుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆమెను పిలిపించి మాట్లాడింది. తర్వాత కొందరు సీనియర్ నేతలు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

కిషోర్ రెడ్డితో మాట్లాడిన పార్టీ నేతలు?
ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో ఉన్న భూమా కిషోర్ రెడ్డి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచిపేరు తెచ్చుకున్నారు. పార్టీ నేతలు కొందరు ఆయనతో భేటీ అవగా ఆయన కూడా రావడానికి అంగీకరించినట్లు సమాచారం. భూమా నాగిరెడ్డికి బంధువే అయిన కిషోర్ రెడ్డిని నిజమైన వారసుడిగా ఆ వర్గానికి చెందిన నేతలు పరిగణిస్తుంటారు. అయితే ఆళ్లగడ్డ ఇవ్వాలా? వేరే నియోజకవర్గంలో ఇవ్వాలా? అనే విషయమై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు నంద్యాలలో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి బదులుగా తన సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సీటిప్పించుకోవాలని అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఆమెకు ఇంతవరకు స్పష్టమైన హామీ లభించలేదు. మరోవైపు అఖిలప్రియకు, సోదరుడయ్యే కిషోర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

భూమా రాజకీయ వారసులెవరు?
ఈ తరుణంలో భూమా నాగిరెడ్డి వర్గంలో సగం మంది కిషోర్ రెడ్డివైపే మొగ్గుచూపుతున్నారు. ఈ అంశాన్ని కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుంది. కిషోర్ రెడ్డిని ఇప్పటికే అమరావతికి పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. రెండు నెలల వ్యవధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో అంతర్గత మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ భూమా నాగిరెడ్డి వారసులుగా వారి పిల్లలే కాకుండా సోదరుల పిల్లలు కూడా చెలామణి అవుతున్నారు. రాజకీయంగా ఆయన పేరును ఎవరు నిలబెడతారనేది త్వరలోనే తేలిపోనుంది.