పవన్ కళ్యాణ్! ట్వీట్లు ఆపు, మోడీని నిలదీద్దామా: శివాజీ, వారికి కేసుల భయం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ట్వీట్లు పక్కన పెట్టి రోడ్డు మీదకు రావాలని సినీ నటుడు శివాజీ గురువారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన హైదరాబాదులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు మనం వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో మోడీకి మద్దతిచ్చింది మనమేనని, కాబట్టి ట్వీట్లు పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం రోడ్ల పైకి రావాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తే కేవలం ఐదు నిమిషాల్లో పని అయిపోతుందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీల పైన పవన్ కళ్యాణ్ స్పందన సరైందేనని చెప్పారు. మనం హోదా కోసం ప్రధాని మోడీనే నిలదీద్దామని జనసేన అధినేకు సూచించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఇద్దరు ఎంపీలు పార్లమెంటులో నిలదీశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసేందుకు భయపడుతున్నారన్నారు. కేంద్రానికి ఎదురు వెళ్తే కేసులు బయటకు తీస్తారని కొందరు భయపడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రజలను మభ్యపెట్టిన రాజకీయ నాయకులు మరోసారి వారిని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. అందరినీ కలుపుకొని వెళ్లి ప్రత్యేక హోదా సాధించాల్సిన అవసరముందన్నారు.












Click it and Unblock the Notifications