డిసైడింగ్ ఓట్ బ్యాంక్ పై సీఎం జగన్ పట్టు - చంద్రబాబు మౌనం వెనుక..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఉద్యోగులు గుర్రుగా ఉన్నారనే అభిప్రాయంతో ఉన్న ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఒకే ఒక్క కేబినెట్ భేటీతో ఉద్యోగులను తన వైపు తిప్పుకున్నారు. ఉద్యోగుల డిమాండ్ల మీద మద్దతిస్తూ మాట్లాడిన ప్రతిపక్షాలు తాజా నిర్ణయాల తరువాత స్పందించ లేదు. నిర్ణయాలు వ్యతిరేకించ లేదు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
ఉద్యోగుల పై జగన్ నిర్ణయాలు : ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలను దగ్గర చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ లపైన గురి పెట్టారు. అన్ని పథకాల అమల్లో నూ ప్రాధాన్యత ఇచ్చారు. అందునా అన్ని పథకాలు మహిళలకే అమలు చేస్తున్నారు. నవరత్నాలు మహిళలకే అందిస్తున్నారు.

రైతులకు ప్రత్యేక పథకాలతో వారిని తన వైపు తిప్పుకున్నారు. ఈ నాలుగేళ్ల కాలం లో కరువు రాకపోవటం ముఖ్యమంత్రికి కలిసొచ్చింది. ఇప్పుడు ఉద్యోగుల పైన ఫోకస్ చేసారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఒక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయాలతో పరిష్కార మార్గం చూపించారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల పైన ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
పీఆర్సీ పైనా వ్యూహాత్మకంగా : కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాల డిమాండ్లు..ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాల పైన ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన చీఫ్ పవన్ స్పందించ లేదు. విమర్శించ లేదు. సీపీఎస్ స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది. దీని కంటే ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగింది ఏదీ లేదని ఉద్యోగ సంఘాల నేతలే అంగీకరిస్తున్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల ప్రస్తావన లేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ వేగం పెంచారు. ఉద్యోగులు డిమాండ్ చేయకుండానే 12వ పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి కాలపరిమితి విధించనున్నారు. ఎన్నికల లోగా కమిటీ రిపోర్టు రాకుంటే మరోసారి ఐఆర్ ప్రకటించి..ఉద్యోగులకు మరింత దగ్గర కానున్నారు.

చంద్రబాబు మౌనం వెనుక : టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ సోషల్ మీడియా సమావేశంలో అమరావతి పైన వ్యాఖ్యలు చేసారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను ప్రకటించిన సంక్షేమ పథకాలను మరోసారి వివరించారు. ప్రచారం కల్పించాలని సూచించారు. ఉద్యోగుల అంశాలు..ప్రభుత్వ నిర్ణయాల పైన స్పందించలేదు.
జీపీఎస్ పైన ఏం మాట్లాడినా తాను అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు చేయలేకపోయా రనే ప్రశ్నించే అవకాశం ఉంది. పీఆర్సీ పైన నిర్ణయం తీసుకోవటంతో..ఇక దాని గురించి చంద్రబాబు ప్రస్తావనకు ఛాన్స్ లేదు. దీంతో, ఇప్పుడు ఉద్యోగుల ఓట్ బ్యాంక్ పైన సీఎం జగన్ పట్టు సాధించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు ఇంత కంటే మిన్నగా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందా.. ఇచ్చినా సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications