పవన్ కళ్యాణ్ ఏమన్నారు: కేశినేని ఎందుకు ఉగిపోయారు?
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్రంగా రెచ్చిపోవడానికి గల కారణమేమిటనే చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసే తీవ్రమైన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్‌పై కేశినేని నాని చేశారు. పైగా, పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన తర్వాత కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం వెనక ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సోమవారం పవన్ కళ్యాణ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో టీడీపీ ఎంపీలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై నేడు పలువురు టీడీపీ ఎంపీలు తీవ్రంగానే స్పందించారు. ఎంపీలందరూ తాము రాష్ట్రం కోసం ఎంతగా పని చేస్తున్నది వివరణ ఇచ్చుకున్నట్లు కనిపించినా కేశినేని మాత్రం కొంత ఘాటుగా జవాబు చెప్పారు..

‘ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా పోట్లాడారని, పార్లమెంటు గోడలు చూస్తూ నోరెళ్లబెడుతున్నారని' పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని నాని భావించడం వల్లే ఆయన ఇంత తీవ్రంగా విమర్శించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ ఆరు నెలలకోసారి నిద్రలేసి మాట్లాడితే ఎలా? అంటూ నాని పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. తెలంగాణలో తమ సినిమాలు ఆడటం కోసం, హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్‌ను పవన్ పొగుడుతున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్‌పై నాని చేసిన ఈ ఘాటు విమర్శలతో తెలుగుదేశం, జనసేన పొత్తుకు బీటలు వారుతున్నాయా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బుధవారం చంద్రబాబు జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నానీని వివరణ కోరుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటివాళ్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకించినప్పటికీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదు.












Click it and Unblock the Notifications