'బాబును ఈ ప్రశ్నలడగని పవన్': టీడీపీతో ముదిరింది, రంగంలోకి ఫ్యాన్స్
కడప: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నించేందుకు ప్రశ్నలే కరువయ్యాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ చాలా ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చారని, కానీ ప్రశ్నలు మాత్రం ఆయనకు దొరకలేదన్నారు.
రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి పట్టుబడిన వైనం, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పైన ఆయన చెప్పలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబును పవన్ సమర్థిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు.
ఎదుటి వారి కళ్లలో దూలాలు చూడగల ఆయన ఓటుకు నోటు వ్యవహారాన్ని గమనించకపోవడాన్ని బట్టి చూస్తే ఏమైనా దృష్టిలోపం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ యాదాద్రికి ఆర్కిటెక్టర్ డిజైనర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన ఆనందసాయిని నియమించడాన్ని అభినందించిన పవన్ కళ్యాణ్, అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు సింగపూర్ దేశస్తులకు అప్పగించడాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ ప్రకటన రాజకీయ ఉద్దేశ్యంతో చేసిందే అన్నారు.
కేశినేని నానిపై జనసేన ఆగ్రహం
పవన్ కళ్యాణ్ పైన టీడీపీ ఎంపీలు, ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై జనసేన మండిపడుతోంది.
ఏపీ వ్యాప్తంగా టీడీపీ పైన జనసేన నిప్పులు చెరుగుతోంది. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలను జనసేన దగ్ధం చేసింది. తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ వద్ద జనసేన నిరసనకు దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద పవన్ అభిమానులు ధర్నాకు దిగారు.
పవన్‌ను విమర్శించడం హీరోయిజం అనుకుంటున్నారా అని మండిపడ్డారు. కేశినేని నానికి దమ్ముంటే రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలని సవాల్ చేశారు. ఏపీలో గూడుకట్టుకున్న ఆలోచనలను పవన్ చెబితే, ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ అవసరం లేదని చెబితే బాగుండేదన్నారు.












Click it and Unblock the Notifications