బాబును కలిసిన కడియం: టీ ఫ్యాక్టరీకి ఏపీ అవసరం ఏమిటి?
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని ములుగు మండలం కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీ తెరిపించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి మంగళవారం కలిశారు. అయితే, వరంగల్ జిల్లాలోని ఫ్యాక్టరీని తెరిపించేందుకు కడియం ఏపీ సీఎంను కలవడం వెనుక కారణాలున్నాయి.
ఈ పరిశ్రమకు అవసరమైన యూకలిప్టస్ తోటలు తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఏపీ నుండి రాయితీ పైన కలప సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అఠవీ అభివృద్ధి సంస్థ ద్వారా 50 శాతం రాయితీపై కలప సరఫరా అయ్యేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్లు కడియం శ్రీహరి మంగళవారం చెప్పారు.

వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలోని రేయాన్స్ పరిశ్రమ గత ఏడాది మూతపడడంతో వేలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం రేయాన్స్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ... తెలంగాణ రాష్ట్రంలో దొరికే ముడిసరుకు పోను ఇతర రాష్ట్రం నుండి తెచ్చుకోవాలి. ముడిసరుకు ఎగుమతులపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నిషేధం ఉంది.
దీంతో, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నారు. దానికిగాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లభ్యమయ్యే సుబాబులను (యూకలిప్టస్) 50 శాతం రాయితీతో సరఫరా చేయాలని చంద్రబాబును కడియం కోరారు. వారి విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వీరి మధ్య రాజకీయ పరమైన అంశాలు చర్చకు రాలేదు.












Click it and Unblock the Notifications