రేవంత్‌ని మాట్లాడనివ్వాలి: సతీష్, 'వైస్రాయ్ క్యాంప్ నడిపిందే కేసీఆర్'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజల సమస్యలపై తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అధికార పక్షం అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ఉద్యమ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ సతీష్ మాదిగ మంగళవారం అన్నారు.
ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయని మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మిగిలిపోతాడన్నారు. రేవంత్ రెడ్డిని అసెంబ్లీ మాట్లాడించి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

'క్యాంప్ నడిపిందే కేసీఆర్'
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను మాట్లాడనీయకుండా అధికార పక్షం అడ్డుకుంటోందని, మైకు ఇవ్వడానికే భయపడుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం మండిపడ్డారు. మంగళవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లితో పాటు పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు.
హరీష్ రావు సభాపతి వెనకాల ఉండి అసెంబ్లీని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించే ముందు మీ మామ కేసీఆరే ముందుండి వైస్రాయ్ హోటల్‌లో క్యాంపు నడిపించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ధ్వజమెత్తారు. కేసీఆర్ క్యాంపును బాగా నడిపించినందునే అప్పుడు మంత్రి పదవి దక్కిందన్నారు.
అమరులకు తీరని అన్యాయం: రేవంత్ రెడ్డి
దశాబ్దాలపాటు చేసిన పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వం, కేసీఆర్ ఆర్ ప్రాణత్యాగం చేసిన అమరులకు తీరని అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి వేరుగా ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్‌లో అమరులు, అమరుల కుటుంబాలకు సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశించగా నిరాశే ఎదురయిందన్నారు.












Click it and Unblock the Notifications