మరో మహిళతో వివాహేతర సంబంధం..: తాగుబోతు భర్తను హతమార్చిన భార్య
తిరుపతి: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. తాగుడుకు బానిసై వేధిస్తుండటంతో.. ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెంగరగుంట గ్రామానికి చెందిన కృష్ణప్ప మద్యానికి బాగా బానిసయ్యాడు. పలమనేరులో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కృష్ణప్ప తీరు నచ్చని భార్య శాంతమ్మ, కుమారుడు, కుమార్తె అతన్ని దూరం పెట్టారు. దీంతో రెండేళ్ల నుంచి అతను ఇంటికి దూరంగానే ఉంటున్నాడు.
అయితే కట్టుకున్న భర్తను కాదనలేక శాంతమ్మ అతనితో ఫోన్ లో మాట్లాడుతుండేది. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం కృష్ణప్పతో సంబంధం పెట్టుకున్న మహిళకు శాంతమ్మకు మధ్య గొడవ జరిగింది. తీరు మార్చుకోవాలని తన భర్తకు దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించింది.

ఆమె సంగతి పక్కనపెడితే భర్త ప్రవర్తనలోనూ మార్పు లేకపోవడంతో అతనిపై కోపం పెంచుకుంది. గత గురువారం రాత్రి కృష్ణప్ప పెంగరగుంటకు వచ్చి భార్యకు ఫోన్ చేసి పొలం సమీపంలోకి రావాలని చెప్పాడు.
శాంతమ్మ అక్కడికెళ్లాక కృష్ణప్పతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పట్టరాని ఆవేశంతో శాంతమ్మ ఓ బండరాయితో కృష్ణప్ప తలపై మోది చంపేసింది. హత్యానంతరం భర్త మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
పొలం సమీపంలో పడి ఉన్న మృతదేహాన్ని పక్కనే ఉన్న రహదారి పైకి లాక్కొచ్చి పడేసింది. శుక్రవారం ఉదయం గుడియాత్తం రోడ్డుపై పడి ఉన్న కృష్ణప్ప మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానిక పొలం గట్లపై కూడా రక్తపు మరకలు ఉండటం గమనించారు. పైగా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఇది హత్యేనని నిర్దారించుకుని కుటుంబ సభ్యులను విచారించగా.. శాంతమ్మ నిజం అంగీకరించింది. తానే హత్య చేసినట్టు పోలీసులు ముందు ఒప్పుకుంది.












Click it and Unblock the Notifications