ఇన్స్యూరెన్స్ సొమ్ము కోసం భర్త మృతిపై నాటకం, చివరికిలా!
గుంటూరు: రోగంతో భర్త మృతి చెందితే ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ భార్య ఘాతుకమిది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పథకం ప్రకారం భర్త మృతదేహాన్ని కారుతో తొక్కించింది. చివరకు నేరం బైటపడి ఆమె, ఆమెకు సహకరించిన వారు జైలు పాలయ్యారు.

ఓ భార్య ఘాతుకం...
డబ్బు కోసం ఎంతకైనా దిగజారడమంటే ఏమిటో తెలియజేసే నేరఘటన ఇది. ఈ ఒక్క నేరంలోనే సమాజంలో చోటు చేసుకుంటున్న అన్ని రకాల అవలక్షణాలు బహిర్గతం అయ్యాయి. డబ్బు కోసం మానవతా విలువలు పట్టించుకోవడం మానేసారని, బంధాలు, అనుబంధాల గురించి అసలే మాత్రం ఆలోచించడం లేదని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. అంతే కాదు సామాన్యులు సైతం ఈజీమనీ కోసం ఎంతో హైటెక్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని రుజువైంది. రోగం వచ్చి చనిపోయిన భర్తని ఇన్సూరెన్స్ డబ్బు కోసం నడిరోడ్డు మీద పడేయించి కిరాయి మనుషులతో కారుతో తొక్కించిందో ఇల్లాలు..ఆ తరువాత అతి పెద్ద నాటకమాడి భీమా సొమ్ము చేతికందేవరకు కథ నడిపించింది. ఇంకేముంది...భీమా సొమ్ము రూ.10 లక్షలను తోడు దొంగలతో కలసి పంచుకునేందుకు సిద్ధమైంది. అయితే తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్లు చేసిన పాపం బైటపడి కరెన్సీ కట్టలు లెక్కబెడదాం అనుకున్న ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది.

పథక రచన ఇలా...
వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని పెదరావూరు సుగాలీ కాలనీకి చెందిన రమావత్ కస్నా అనే వ్యక్తి దీర్ఘకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతూ ఈ నెల 15న ఇంట్లోనే మృతిచెందాడు. అయితే క్షయ వ్యాధితో భర్త చనిపోవడం ఖాయమని ఊహించిన అతడి భార్య భద్రమ్మ తన అల్లుళ్లతో కలసి భర్త మరణాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ పథకం రచించింది. ఆ ప్లాన్ ప్రకారం ఆమె అల్లుళ్లు నల్గొండ జిల్లా రాళ్లవాగు తండాకు చెందిన ధరావత్ రాజు నాయక్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్, మధ్యవర్తి శ్రీను నాయక్ ద్వారా భద్రమ్మ భర్త రమావత్ కస్నా పేరిట రూ.10 లక్షలకు ప్రమాద భీమా చేయించారు. ముందుగానే ఏడాది ప్రీమియం రూ.1510 చెల్లించారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతేనే రూ.10 లక్షలు బీమా సొమ్ము వస్తుంది. అంతే తప్ప సహజ మరణానికి రాదు. ఈ నేపథ్యంలోనే రమావత్ కస్నామృతి చెందడంతో ఎలాగైనా భీమా సొమ్ము దక్కించుకోవాలనుకున్న భద్రమ్మ తన భర్త సహజ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ డబ్బు చేజిక్కించుకోవచ్చని ఆలోచించింది. అల్లుళ్లు దగ్గరి బంధువులు కలసి భీమా సొమ్ము కోసం పథకం అమలు చేయడానికి రంగంలోకి దిగారు. వచ్చే భీమా సొమ్ము రూ.10 లక్షలు ఎవరెంత వాటా తీసుకోవాలో నిర్ణయించేసుకున్నారు. భద్రమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, ఇన్సూరెన్స్ ఏజెంటు, మధ్యవర్తి కలసి రూ.6 లక్షలు తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

పథకాన్ని ఇలా అమలు చేశారు....
టీబీతో భర్త రమావత్ కస్నా ఇంటి దగ్గరే చనిపోయిన విషయాన్నిబీమా ఏజెంట్ రాజునాయక్ కు భద్రమ్మ తెలియచేసింది. అతడి సూచనల ప్రకారం ఆమె ఇద్దరు అల్లుళ్లు నూనావత్ జయరాయ్ నాయక్ , బాణావత్ సైదా నాయక్ ఒక ఆటోలోకి రమావత్ కస్నా మృతదేహాన్ని ఎక్కించుకుని మల్లెపాడు వరకు తీసుకువచ్చి అక్కడ నడిరోడ్డుపై ఆ మృతదేహాన్ని ఆటోలో నుంచి తోసేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆటో వెనుకే కారులో ఫాలో అవుతున్న ఏజెంట్ రాజునాయక్, మధ్యవర్తి శ్రీను నాయక్ రోడ్డుపై పడిఉన్న రమావత్ కస్నా మృతదేహాన్ని కారుతో తొక్కించేశారు. దీంతో మృతదేహానికి కాళ్లు చేతులు విరిగిపోయి తల భాగం దెబ్బతింది. ఆ తరువాత మళ్లీ ఆ మృతదేహాన్ని వీళ్లే తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

గుట్టు బైటపడిందిలా...
అయితే మృతదేహం నుజ్జునుజ్జు అయిన తీరు, ప్రమాదంపై వీరు చెబుతున్న మాటలపై వైద్యుల్లో సందేహాలను కలిగించాయి. దీంతో వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం దారుణం బైటపడింది. పోలీసుల విచారణలో మృతుడి భార్య భద్రమ్మ బీమా ఏజెంట్ తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని మృతి తర్వాత తాము ఏం చేసిందీ అన్నీ వివరించింది. దీంతో ఇంత నీచానికి ఒడిగట్టిన భద్రమ్మ, ఆమె అల్లుళ్లు, ఇన్సూరెన్స్ ఏజంట్లు అందరూ కటకటాల్లోకి వెళ్లారు. అయితే ఈ ఘటన సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు నిదర్శనమని తెలిసిన ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications