రంగా పేరుతో ఓట్లడిగే పరిస్ధితి ఉందా ? అయినా వైసీపీ, టీడీపీ రాజకీయం !అసలు టార్గెట్ పవన్..?
ఏపీలో వైసీపీ, టీడీపీ ఇప్పుడు వంగవీటి రంగాను తమవాడిగా చెప్పుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఆయన వర్ధంతిని తమ పార్టీ నేతలకు మించి, జాతీయ నేతలకు మించి ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుమారుడు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధాను ఈ కార్యక్రమాల్లో భాగస్వామిని చేస్తే చాలని భావిస్తున్నాయి. దీంతో వంగవీటి రంగా పేరుకు ఇప్పటికీ అంత క్రేజ్ ఉందా ? నిజంగానే ఓట్లు కురిపించే సత్తా ఉందా ? ఉంటే రంగా మరణం తర్వాత ఓసారి మాత్రమే గెలిచిన వంగవీటి రాధా.. ఆ తర్వాత ఎందుకు వరుసగా ఓడిపోయారు ? పార్టీలు టికెట్ ఇచ్చేందుకు సిద్దమైనా పోటీ చేయకుండా ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు ? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీలో రంగా పాలిటిక్స్
ఏపీ రాజకీయాల్లో మూడు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన విజయవాడ కాపు నేత వంగవీటి రంగా ఓ దశలో తన సొంత పార్టీ కాంగ్రెస్ ను వీడి సొంతంగా రాజకీయ పార్టీ స్ధాపిస్తారనే ప్రచారం కూడా సాగింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా, సామాన్యుల మద్దతుతో రంగా సాగించిన రాజకీయం..సొంత సామాజిక వర్గం కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాల్నిసైతం ఆకర్షించింది. చివరికి ఆయన ఎదుగులను తట్టుకోలేని కొందరు పట్టపగనే ఆయన్ను హతమార్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రాధాకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రంగా రాజకీయాన్ని కానీ, అన్ని వర్గాల్ని రంగా కలుపుకున్న తీరును కానీ కొనసాగించడంలో విఫలమయ్యారు. దీంతో సహజంగానే రంగా పేరు కూడా కనుమరుగవుతూ వచ్చింది. అయితే రాష్ట్రంలో కాపు రాజకీయం కీలకంగా మారిన ప్రతిసారీ రంగా పేరు తెరపైకి వస్తూనే ఉంది, ఆయన కుమారుడు రాధాకు రాజకీయ పార్టీల్లో ఆదరణ కూడా లభిస్తోంది. ఇప్పుడూ అదే పరిస్ధితి కనిపిస్తోంది.

రంగా చుట్టూ వైసీపీ, టీడీపీ
వంగవీటి రంగాను తమ వాడిగా చెప్పుకునేందుకు కొంతకాలంగా వైసీపీ,టీడీపీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఒకప్పుడు వైసీపీలో ఉన్న ఆయన కుమారుడు రాధాకృష్ణ,గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిపోయారు. అప్పట్లో ఆయన తండ్రి హత్యకు గురైన సమయంలో అధికారంలో ఉన్న టీడీపీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించినా ఎవరో ఒకరు చేసిన తప్పుకి పార్టీని బాధ్యురాలిని చేయలేం కదా అంటూ పసుపు పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. తద్వారా అప్పట్లో కొందరు నేతలు తన తండ్రిని పొట్టనబెట్టుకుంటే దాన్ని టీడీపీకి అంటగట్టలేమని క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ ఆయన్ను కాపు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వాడుకుంది. అయినా జనం నమ్మలేదు.అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా తమ పార్టీని వదిలేసిన రాధాపై మోజును వదులుకోలేదు. దీనంతటికీ కారణం ఓట్ల రాజకీయమే.

ఎన్నికల వేళ మరోసారి ?
ముఖ్యంగా రంగా పేరుతో జరిగే రాజకీయానికి ఎన్నికల సమయం కీలకంగా మారుతుంటుంది. ఈసారి కూడా మరో 15 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రంగాను ఓన్ చేసుకుంటే తమకు కాపుల ఓట్లు తప్పకుండా పడతాయన్న భావనలోకి వైసీపీ, టీడీపీ వెళ్లిపోతున్నాయి. అయితే ఇందులో రాధా తమ పార్టీలో ఉన్నప్పటికీ వైసీపీతో పోటీ పడుతూ రంగా కోసం టీడీపీ చేస్తున్న రాజకీయం ఓ ఎత్తయితే, తమ పార్టీలో నుంచి రాధా వెళ్లిపోయినా ఆయన్ను పల్లెత్తుమాట అనకపోగా.. ఆయన తండ్రి రంగా జయంతి, వర్ధంతుల్ని, విగ్రహావిష్కరణల్ని వైసీపీ నేతలు ప్రతిష్టాత్మంగా తీసుకుటుంటున్నారు. దీంతో రంగా చుట్టూ వైసీపీ,టీడీపీ చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కీలకంగా మారిపోయింది.

రంగా పేరుకు ఓట్లు పడతాయా ?
ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం విజయవాడ కేంద్రంగా రాజకీయాలు నడిపిన వంగవీటి రంగా పేరుతో ఇప్పుడు రాజకీయాలు చేసేందుకు వైసీపీ, టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రంగాను ఓన్ చేసుకుంటే చాలు కాపుల ఓట్లు గంపగుత్తగా పడతాయనే భావనలోకి జారిపోతున్నారు. కానీ రంగా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడు ఓట్లు ఎంతవరకూ పడతాయనే లాజిక్ మాత్రం పట్టించుకోవడం లేదు. రంగా పేరుతో ఆయన కుమారుడు రాధా పలుమార్లు జనంలోకి వెళ్లి ఓట్లడిగారు. కానీ విజయవాడలోనే ఆయన పలుమార్లు ఓడిపోయారు. ఇప్పుడు టికెట్ తీసుకుని పోటీ చేయడం కంటే రంగా కుమారుడిగా వైసీపీ, టీడీపీలో తనకు దక్కుతున్న గౌరవమే ముఖ్యమన్నట్లుగా రాధా మారిపోయారు. అదే విషయం తాజాగా నిన్న కూడా రాధా మరోసారి స్పష్టం చేశారు.

పవన్ కోసమే తెరపైకి రంగా ?
రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధినేత, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు కంటే పవన్ కు ఆదరణ పెరుగుతోంది. చంద్రబాబు, జగన్ పాలనను చూసిన జనం ఇప్పుడు పవన్ వైపు కొంతమేర మొగ్గుతున్నారనే ప్రచారం ఉంది. అలాంటి సమయంలో పవన్ ఎక్కువగా ఫోకస్ కాకుండా చూసేందుకు రంగాను వైసీపీ కావాలనే తెరపైకి తెస్తోందనే వాదన వినిపిస్తోంది. దీంతో టీడీపీ కూడా డిఫెన్స్ లో పడి రంగా కార్యక్రమాల నిర్వహణలో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో రాధాను భాగస్వామిని చేయడం ఇప్పుడు ఇరుపార్టీలకు అత్యవసరంగా మారిపోయింది. దీంతో పవన్ ను చెక్ పెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో అనివార్యంగా టీడీపీ కూడా ట్రాప్ లో పడి తమ పార్టీలోనే ఉన్న రాధాను ప్రత్యేకంగా చూస్తోంది. ఇప్పుడు రాధాను కూడా ఇరుపార్టీలు ఏమీ అనలేని పరిస్ధితి. వచ్చే ఎన్నికల వరకూ ఇదే పరిస్ధితి ఉంటుందని తెలుస్తోంది. అయితే పవన్ ను కాదని, రాధాను జనం నమ్మ పరిస్ధితి ఉండకపోవచ్చని చెప్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications