APSRTC: టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో సభకు ఆర్టీసీ బస్సులు ఇస్తుందా ?
ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సభ ఇరు పార్టీలకు కీలకంగా మారింది. ఇరు పార్టీల తరఫున ఇచ్చే ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సభకు జనాన్ని భారీగా తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కావాలని టీడీపీ అధికారికంగా కోరింది. అయితే ఆర్టీసీ మాత్రం స్పందించడం లేదు.
టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో సభకు ప్రైవేటు బస్సులు కావాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరి పేటకు అద్దె ప్రాతిపదికన బస్సులు కేటాయించేలా అన్ని డిపోలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ వీసీ, ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. గతంలో రాజమండ్రి మహానాడు సభతో పాటు టీడీపీ పెట్టుకున్న పలు సభలకు ఆర్టీసీ బస్సులు కోరినా ఇవ్వలేదని గుర్తుచేశారు.

తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా బస్సులు ఇవ్వని ఆర్టీసీ.. అధికార వైసీపీ సభలకు మాత్రం అడిగిందే తడవుగా బస్సులు ఇస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఓ రాజకీయ పార్టీగా టీడీపీ చేస్తున్న విజ్ఞప్తుల్ని పట్టించుకోకపోవడం సరికాదని తెలిపారు. ఈసారైనా తమకు చిలకలూరి పేట సభకు బస్సులు కేటాయించాలని కోరారు. అయితే ఆర్టీసీ ఈసారి కూడా వివిధ కారణాలతో బస్సులు కేటాయించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీడీపీ-జనసేన తదుపరి నిర్ణయం ఏంటన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications