భద్రాచలమా, తెలంగాణా ఏది కావాలి?: టికి అల్టిమేటం

పోలవరం ప్రాజెక్టులో 276 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 208 గ్రామాలు భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే పోలవరం నిర్మాణంపై ఒడిసా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అభ్యంతరం చెబుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి భద్రాచలం తెలంగాణలోనే ఉంటే మరో అంతర్రాష్ట్ర వివాదం తోడవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది.
దీంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని మంత్రులు కేంద్రానికి నివేదించారు. భద్రాచలం 1861 నుంచి 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉందని, ఇపుడు విభజన అనివార్యమైతే సీమాంధ్రలోనే కలపాలని, ముఖ్యంగా జల వివాదాలు తలెత్తకుండా ఉండాలన్నా ఇది కచ్చితంగా సీమాంధ్రలోనే ఉండాలని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. విభజన జరిగితే భద్రాచలం, పోలవరం తదితర ప్రాంతాలలో ఉన్న భూములన్నీ ఆంధ్రా ప్రాంతంలోకే వస్తాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివ రావు అన్నారు.
రాష్ట్ర విభజన జరిగినట్లయితే పోలవరం ప్రాజెక్టుకు ఇరువైపులా ముంపునకు గురయ్యే భూములన్నీ ఆంధ్రా పరిధిలోకి రాకపోతే పోలవరం ప్రాజెక్టు కూడా రాదన్నారు. భద్రాచలం మాత్రం ఆంధ్రా ప్రాంతానికే చెందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం సీమాంధ్రలోని అంతర్భాగమని నినదిస్తూ సీమాంధ్ర సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గిరిజన పూజారులు, గోదావరి విద్యార్థి సమైక్య భార్గవసేన, ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మరోవైపు భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలని ఖమ్మం జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలమా?..తెలంగాణా?
భద్రాచలం కావాలో తెలంగాణ కావాలో తెలంగాణ ప్రాంత నాయకులు స్పష్టంగా తేల్చుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వీర్రాజు అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణాకు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఆంధ్రులు రాజధానులను కోల్పోవడం వల్ల ప్రతిసారి నష్టపోతున్నారన్నారు. మంగళవారం గుంటూరులో జరిగిన సీమాంధ్ర బీజేపీ నేతల సమావేశంలో 13 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనలో భద్రాచలం సీమాంధ్రకే చెందాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తే రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఫలితంగా సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుందన్నారు. చారిత్రకంగా చూసినా 1820 నుంచి భద్రాచలం సీమాంధ్రలోనే ఉందన్నారు. అనేక రకాలుగా ఆంధ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రాంత విభజన వాదులు పోలవరాన్ని అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు.












Click it and Unblock the Notifications