మెదక్ నుండి కిషన్ రెడ్డి పోటీ, పవన్ కళ్యాణ్ ప్రచారం?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మెదక్ లోకసభకు రాజీనామా చేయనున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ గజ్వెల్ నుండి అసెంబ్లీకి, మెదక్ నుండి లోకసభకు పోటీ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తెరాసకు వచ్చింది. దీంతో కెసిఆర్ మెదక్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆయన రాజీనామా అనంతరం ఆరు నెలల్లో మెదక్ పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మెదక్ పార్లమెంటు నుండి ఎవరిని పోటీ చేయించాలనే విషయమై బిజెపి, తెరాస, కాంగ్రెసు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ నుండి ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని పోటీ చేయించాలా మరొకరిని చేయించాలా అనే ఊగిసలాటలో కాంగ్రెసు పార్టీ ఉంది. తెరాస అభ్యర్థి పైన కసరత్తు చేస్తోంది.
బిజెపి కూడా పోటీ కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి లోకసభకు పోటీ చేద్దామని భావించారు. కానీ అది కుదరలేదు. దీంతో ఇప్పుడు మెదక్ నుండి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇరువురం కలిసి పని చేస్తామని వారు అప్పుడు చెప్పారు. దీంతో జగ్గారెడ్డి బిజెపిలో చేరవచ్చునని, మెదక్ నుండి పోటీ చేయవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే అంతలోనే జగ్గారెడ్డి తాను బిజెపిలో చేరడం లేదని, పవన్‌తో ఉన్న స్నేహంతోనే కలిశానని చెప్పారు. మరోవైపు మెదక్ లోకసభకు కిషన్ రెడ్డి లేదా బిజెపి నుండి ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications