టీడీపీ, వైసీపీకి అక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకం - కలిసొచ్చేదెవరికి..!!
ఎన్నికల్లో ఈ సారి తూర్పు గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సామాజిక సమకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తతో ఈ జిల్లాలో లెక్కలు మారుతాయనే అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ప్రభావం పని చేస్తుందని..మెజార్టీ సీట్లు సాధించేలా చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో తుని నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారుతోంది.
కొత్త లెక్కలు
తుని నియోజకవర్గంలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్దదిక్కుగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసారు. ఆయన పైన వైసీపీ అభ్యర్దిగా దాడిశెట్టి రాజా గెలిచారు. ప్రస్తుతం రాజా మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాజా మరోసారి బరిలోకి దిగుతున్నారు. కానీ, టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీ దాదాపు ఖాయమైంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ది రాజాకు 92,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ది కృష్ణుడుకు 68,443 ఓట్లు పోలయ్యాయి.

హోరా హోరీ
జనసేన నుంచి పోటీ చేసిన అశోక్ బాబుకు 6,413 ఓట్లు దక్కాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే, మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. యనమల కుటుంబంలో సీటు కోసం విభేదాలు బయటకు వచ్చాయి. చంద్రబాబు జోక్యంతో యనమల కృష్ణుడు పార్టీ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో ఈ సారి రెండు పార్టీలు తమ బలం నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీ సారీ యనమలకు మంత్రి పదవి దక్కింది. శాసనసభా స్పీకర్ గానూ యనమల పని చేసారు. ఈ సారి తన వారసురాలిని బరిలోకి దించుతున్నారు.
ప్రతిష్ఠాత్మక పోరు
చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గంలో స్థానిక పరిస్థితుల పై ఎప్పటికిప్పుడు సర్వే నివేదికల ద్వారా పార్టీని అప్రమత్తం చేస్తున్నారు. అయితే, గోదావరి జిల్లాల్లో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఈ నియోజకవర్గంలో గెలుపు పైన ఆశలు పెట్టుకున్నాయి. కాపు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు సీట్ల కేటాయింపులు...ఎన్నికల హామీలు ఓటర్ల ను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన ఉండనుంది. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్ది దాడిశెట్టి రాజా పైనే వదిలేసారు. దీంతో, తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications