మళ్లీ స్టాండ్ మార్చేసిన టీడీపీ-జనసేన ? క్యాడర్ కు తాజా సంకేతాలు ! ఆ తప్పు రిపీట్ చేస్తారా ?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న విపక్ష పార్టీలు..ఎప్పటికప్పుడు వాటిని మార్చేస్తున్నాయి. తద్వారా వైసీపీ ఊహకి అందకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఓసారి విజయవాడలో కలిసిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పరస్పర ప్రస్తావన లేకుండా మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు క్యాడర్ కు మరో కొత్త సంకేతం కూడా పంపించేస్తున్నారు. దీనిపై వారిలో అసహనం వ్యక్తమవుతోంది.

టీడీపీ-జనసేన పొత్తు
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై ఈ మధ్య కాస్త క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా విశాఖలో వైసీపీ వికేంద్రీకరణ గర్జన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ప్రధాని మోడీతో సమావేశమై రోడ్ మ్యాప్ గురించి చర్చించారు. తిరిగి చంద్రబాబుతో మళ్లీ భేటీ అయ్యేందుకు పవన్ ప్రయత్నించలేదు. అలాగే చంద్రబాబు కూడా పవన్ పేరెత్తకుండానే తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరికీ మళ్లీ ఏమైందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ,జనసేన క్యాడర్ కు తాజా సంకేతాలు అందుతున్నాయి.

విడివిడిగానే టీడీపీ, జనసేన పోటీ ?
తాజాగా టీడీపీ,జనసేన క్యాడర్ కు అందుతున్న సంకేతాలను బట్టి చూస్తుంటే ఇరుపార్టీలు వచ్చే ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కలిసి పోటీ చేయడం కంటే విడిగా పోటీ చేస్తేనే 2024లో తాము అధికారం సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ప్రస్తుతానికి ఇరు పార్టీలు పరస్పర ప్రస్తావన లేకుండానే ముందుకెళ్లాలని కూడా యోచిస్తున్నాయి. అలాగే అధినేతలైన చంద్రబాబు, పవన్ కూడా ఒకరి గురించి మరొకరు ఎక్కడా ప్రస్తావన లేకుండా ఎవరి రాజకీయం వారు సాగిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పలు ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు.

విడిగా పోటీ వల్ల ప్రయోజనాలు ?
టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఈసారి మాత్రం పలు ప్రయోజనాలు ఉంటాయని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని తనపైకి దండయాత్రకు వస్తున్నాయని, పొత్తు లేకుండా ఇరు పార్టీలు పోటీ చేస్తే ఓడిపోతాయని జగన్ చేస్తున్న వాదనకు చెక్ పెట్టేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే ఇద్దరూ టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయాలంటే బీజేపీకి గుడ్ బై చెప్పాలి, లేకపోతే బీజేపీని కూడా ఈ కూటమిలో కలుపుకోవాలి. కానీ బీజేపీ ప్రస్తుతానికి అందుకు సిద్ధంగా కనిపించడం లేదు. దీంతో బీజేపీని నొప్పించకుండా ఉండాలంటే విడిగానే పోటీ చేసేందుకు సిద్ధపడాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ తప్పు రిపీట్ చేస్తున్నారా ?
టీడీపీ-జనసేన కలిసి పోటీచేసేందుకు సిద్ధం కాగానే క్షేత్రస్దాయిలో ఇరు పార్టీల క్యాడర్ దాదాపు కలిసిపోయాయి. ఒకరి కార్యక్రమాల్లో మరొకరు కనిపించారు. అలాగే అధినేతలైన చంద్రబాబు కార్యక్రమాల్లో జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు దర్శనమిచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇరువురూ వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు క్యాడర్ కు సంకేతాలు పంపారు. దీంతో క్షేత్రస్ధాయిలో క్యాడర్ లో అసహనం పెరుగుతోంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తమకు గందరగోళం తప్పడం లేదని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందనే వాదన కూడా క్యాడర్ నుంచి వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇలా విడిగా పోటీ పెట్టుకుని దెబ్బతిన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కానీ రాష్ట్రస్ధాయిలో సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఇలా విడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఆయా పార్టీల అధిష్టానాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications