YS Jagan-Chandrababu : చంద్రబాబు కొంపముంచిన ఆ తప్పు జగన్ రిపీట్ చేస్తున్నారా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం వైపు నుంచి పార్టీవైపు నుంచి ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అతి జాగ్రత్తకు పోతున్నట్లు కూడా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోందన్న దానిపైనా జనం చర్చించుకుంటున్నారు.

వైఎస్ జగన్ పాలనలో..
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని లబ్దిదారులకు మరింత మెరుగ్గా అందించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్ధను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో అత్యధికులు వైసీపీ సానుభూతిపరులే.
దీంతో తాము అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన వారికి ఉపాధి కల్పించినట్లయింది. అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున క్షేత్రస్దాయిలో లబ్దిదారులకు ఏ మేలు జరగాలన్నా వాలంటీర్లే కీలకంగా మారిపోయారు. అయితే ఇంతమంది వాలంటీర్లు ఉన్నా జగన్ మాత్రం మరో 5.2 లక్షల మంది కొత్త వాలంటీర్లను నియమించాలని తాజాగా నిర్ణయించారు.

జగన్ గృహసారధుల ప్లాన్
జగన్ తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 5.2 లక్షల మంది కొత్త వాలంటీర్లు రంగంలోకి దిగబోతున్నారు. వీరంతా వైసీపీకి నేరుగా పనిచేసే వారే. ఇప్పటివరకూ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 2.67 లక్షల మంది వాలంటీర్లకు వీరు అదనం. వీరిని గృహసారధులుగా పిలవాలని జగన్ నిర్ణయించారు. దీంతో 5.2 లక్షల మంది గృహసారధులు ఇప్పుడు వైసీపీ తరఫున వాలంటీర్లుగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరిస్తారు.
దీంతో వీరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అన్ని విషయాల్లోనూ భాగస్వాముల్ని చేసేందుకు జగన్ భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. గతంలో బీజేపీ యూపీ, గుజరాత్ లోనూ ఇదే తరహాలో పన్నా ప్రముఖ్ ల పేరుతో భారీగా వాలంటీర్లను నియమించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు జగన్ ప్లాన్ పైనా చర్చ జరుగుతోంది.

గృహసారధులు చేసేదేంటి?
ఇప్పటివరకూ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వాలంటీర్లు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించడం, ప్రభుత్వం తరఫున సర్వేలు చేయడం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం చెప్పిన ఇతరత్రా పనులు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా నియమించబోయే గృహసారధులు అలా కాదు. రేపు ఎన్నికల్లో ఓటేసే ప్రతీ ఒక్కరితోనూ టచ్ లోకి వెళతారు. వారి అవసరాలను గుర్తిస్తారు. ప్రభుత్వం తరఫున కాకుండా పార్టీ తరఫున వారిని మేనేజ్ చేయడం మొదలుపెడతారు. మీ అవసరాలు తీరుస్తాం.. మాకు ఓటేస్తే చాలు అన్న భావన వారిలో కలిగిస్తారు. వైసీపీ నేతల్ని ఓటర్లకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతిమంగా వైసీపీకి ఓట్లు పడేలా చేస్తారు. దీంతో ఓవైపు ప్రభుత్వం తరఫున వాలంటీర్లు, మరోవైపు వైసీపీ తరఫున గృహసారధుల రూపంలో దాదాపు 9 లక్షల మంది ఓటర్ల మేనేజ్ మెంట్ చేయబోతున్నారు.

చంద్రబాబు జన్మభూమి కమిటీల బాటలో
చంద్రబాబు గతంలో నియమించిన జన్మభూమి కమిటీలు కూడా ఇదే పని చేశాయి. జన్మభూమి కమిటీ సభ్యులు జనాన్ని టీడీపీవైపు తిప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీకి ఓటేసే వారిని గుర్తించి వారికే సంక్షేమ పథకాలు అందేలా చూశారు. టీడీపీకి ఓటేయాని వారికి సంక్షేమ పథకాలే కాదు ఇతరత్రా సాయం కూడా ప్రభుత్వం నుంచి అందకుండా అడ్డుపడ్డారు.
దీంతో జనం వీరితో విసిగిపోయారు. వీరికి మామూళ్లు సమర్పించుకోకపోతే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదన్న అంచనాకు వచ్చేశారు. దీంతో ఈ ప్రభావం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా పడింది. కొత్త రాష్ట్రంలో కాస్తో కూస్తో అభివృద్ధి చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు వీరు తీవ్ర ఆటంకంగా మారారు. చివరికి చంద్రబాబును అధికారానికి దూరం చేశారు.

చంద్రబాబు తప్పిదం జగన్ రిపీట్ చేస్తున్నారా?
చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల నియామకం ద్వారా ప్రజలు దగ్గరి నుంచి సేవలు అందిస్తున్నట్లు భావించారు. కానీ సదరు కమిటీలపై నియంత్రణ కరువైంది. దీంతో టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం మొదలైంది. ఆ తర్వాత టీడీపీకి ఓటు వేసిన వారికే సంక్షేమం అందిస్తాం,లేకుంటే లేదన్నట్లుగా తయారైంది. చివరికి చంద్రబాబు ప్రభుత్వం కొంపముంచింది. ఇప్పుడు జగన్ కూడా పార్టీ తరఫున నియమిస్తున్న గృహసారధుల ప్లాన్ చూస్తుంటే జన్మభూమి కమిటీల పాలన తిరిగొస్తుందేమోన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు అనుభవాల నుంచి జగన్ పాఠాలు నేర్చుకుని అలాంటి తప్పిదాలు రిపీట్ చేయకూడదని అంతా కోరుకుంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవాలే జగన్ కూడా చవిచూడాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications