బెయిల్: వైయస్ జగన్ పార్టీకి ఊపునిస్తారా?
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరైన స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీని ఆయన బలోపేతం చేస్తారని వారు విశ్వసిస్తున్నారు. సమైక్యాంధ్రను నిలబెడుతారని కూడా పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం జగన్ పోరాటం చేస్తారని, రాష్ట్రం విడిపోకుండా చూస్తారని కాంగ్రెసు శాసనసభ్యుడు మధుసూదన్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్‌కు సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదనేది కోర్టు షరతుల్లో ఒకటి. దానివల్ల ఆయన పార్టీ కార్యకర్తలను గానీ నాయకులను గానీ హైదరాబాదులోనే కలుసుకోవాల్సి వస్తుంది. అయితే, రాష్ట్ర పర్యటనకు వీలుగా ఆయన కోర్టు అనుమతి పొందడానికి వైయస్ జగన్ తర్వాతి క్రమంలో ప్రయత్నిస్తారా అనేది కూడా ఆలోచనకు అవకాశం ఇస్తోంది.

వ్యూహరచన చేయడానికి, పార్టీ నాయకులను నేరుగా ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోవడానికి జగన్‌కు బెయిల్ వల్ల అవకాశం ఏర్పడుతుంది. దాంతో ఆయన వ్యూహరచనలు చేసి పార్టీ నాయకులను నడిపించేందుకు వీలవుతుంది. రాష్ట్ర పర్యటనలు చేయడానికి వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల పూనుకోవచ్చు. జగన్‌కు బెయిల్ లభించడం అవునన్నా, కాదన్నా పార్టీ పెద్ద ఊరటే.
తెలంగాణలో పార్టీని ఆయన వదిలేస్తారా, కొంత మంది నాయకులను కూడగట్టి తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారా అనేది కూడా చూడాల్సిందే. సీమాంధ్రలో మాత్రం ఆయన సమైక్యాంధ్ర నినాదంతో పార్టీని నడిపించడానికి జగన్‌కు అవకాశం లభిస్తుందని అంటున్నారు. మొత్తంగా, వైయస్ విజయమ్మపై ఉన్న తీవ్రమైన ఒత్తిడి మాత్రం తగ్గిందనే చెప్పాలి. హైదరాబాదులో ఉండి అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి జగన్‌కు వీలు కలుగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications