కలిసిరాని వైసీపీ-బీజేపీ స్నేహం ? ఎమ్మెల్సీ ఫలితాలతో పునరాలోచన-టీడీపీవైపు కాషాయ నేతల చూపు ?
ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య 2019 తర్వాత మొదలైన స్నేహానికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శుభంకార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేసిన 2019 సార్వత్రిక ఎన్నికలు వైసీపీ-బీజేపీని తొలిసారి దగ్గర చేశాయి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావడంతో ఇరువురూ పరోక్షంగా స్నేహం కొనసాగించాయి. అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తూ వచ్చిన వైసీపీ.. ఇప్పుడు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభించే రోజులు వచ్చేశాయి.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన పోరులో టీడీపీ గెలుపు ఇప్పుడు బీజేపీ నేతల్ని ఆలోచనలోకి నెట్టేసింది. దీంతో వైసీపీ బయటపడకపోయినా బీజేపీ నేతలు మాత్రం బయటపడిపోతున్నారు.

వైసీపీ-బీజేపీ స్నేహం
ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం 2019లోనే మొదలైంది. 2014 తర్వాత తమతో స్నేహం చేసి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం పంచుకున్న చంద్రబాబు 2018 నాటికి తమను వీడి వెళ్లిపోయి ధర్మపోరాటం పేరుతో యుద్ధం ప్రకటించడంతో బీజేపీకి ఏపీలో నమ్మకమైన మిత్రుడు అవసరమయ్యాడు. దీంతో సహజంగానే విపక్షంలో ఉన్న వైసీపీకి మద్దతిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పూర్తిస్దాయిలో కేంద్రం నుంచి జగన్ కు సహకారం లభించడం, అనుకున్నట్లుగానే భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ను ఎన్డీయే దగ్గరికి తీసుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య స్నేహం బయటికి చెప్పుకోకపోయినా ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. అందుకే ఏపీ బీజేపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. చివరికి ఈ స్నేహాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీటలు వార్చినట్లు కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఫలితాలతో టర్నింగ్
ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఫలితాలు అధికార వైసీపీకి అగ్నిపరీక్షగా మారాయి. వీటిలో తప్పక నెగ్గాల్సిన పరిస్దితుల్లో వైసీపీ అభ్యర్ధులు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్ధుల చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో వైసీపీ అనుకుంటున్నట్లుగా రాష్ట్రంలో రాజకీయం ఏకపక్షంగా లేదనే సంకేతం అందరికీ వెళ్లింది. అంతే కాదు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు వెలువడిన ఈ ఫలితాలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపైనా ప్రభావం చూపితే జరిగే నష్టం ఏంటన్న దానిపై వైసీపీలోనూ అంతర్మథనం సాగుతోంది. చివరిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ను మరోసారి గెలిపించుకోలేకపోయిన బీజేపీలోనూ అదే అంతర్మథనం మొదలైంది.

ఆ ప్రచారమే కొంపముంచిందన్న బీజేపీ
ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందన్న ప్రచారమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కొంప ముంచిందని బీజేపీ నేతలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ వంటి వారు తమ ఓటమికి వైసీపీతో పొత్తు ప్రచారమే కారణమంటున్నారు. వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందని జనం భావించారని, దాంతో వైసీపీపై ఉన్న వ్యతిరేకత తమకూ నష్టం చేసిందని వారు చెబుతున్నారు. దీంతో వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందన్న అంశాన్ని బీజేపీ నేతలు గుర్తించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలోవారు తమ భవిష్యత్ వ్యూహాల్ని సైతం సిద్ధం చేసుకుంటున్నారు.

టీడీపీవైపు బీజేపీ నేతల చూపులు ?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీలో కీలక నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన వెళ్తూ వెళ్తూ బీజేపీతో ఉన్న తన వర్గాన్ని అంతా తీసుకుని టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన బాటలోనే విష్ణుకుమార్ రాజు, మాధవ్ తో పాటు మరికొందరు కాషాయ నేతలు కూడా టీడీపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ పొత్తు ప్రచారం ఎక్కువైందని, ఇదే పరిస్దితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ తమకు రిక్తహస్తం తప్పదనే భావన వారిలో కనిపిస్తోంది. దానికి బదులుగా టీడీపీలోకి వెళ్లి టికెట్లు తెచ్చుకుని పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరహాలోనే సానుకూల ఫలితాలు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఫలితాలు మాత్రం బీజేపీ నేతలపై తీవ్ర ప్రభావం చూపించాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications